ముంబై, మార్చి 27: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. శుక్రవారం ఆల్‌టైమ్ కనిష్ఠానికి క్షీణించింది. ఈ ఒక్కరోజే ఏకంగా 89 పైసలు పతనమై మునుపెన్నడూ లేనివిధంగా 94 మార్కు ఎగువన ముగిసింది. 95 దరిదాపుల్లోకి వెళ్లి 94.85 వద్ద నిలిచింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో విజృంభిస్తున్న ముడి చమురు ధరలు.. ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిడిని తీవ్రతరం చేశాయి. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగడంతో రూపీ భారీగా బలహీనపడింది. కాగా, దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతినీ అడ్డుకుంటాయన్న ఆందోళనలు కనిపించాయి.
ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ఫారెక్స్ డీలర్లు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. మరోవైపు అదేపనిగా విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి వెనుకకు తీసుకుంటుండటం కూడా రూపాయిని కోలుకోకుండా చేస్తున్నది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద 94.18గా మొదలైన రూపీ వాల్యూ.. సమయం గడుస్తున్నకొద్దీ అంతకంతకూ క్షీణిస్తూ చివరకు 94.85 దగ్గర స్థిరపడింది. మొత్తానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగితే.. దేశ జీడీపీ పెద్ద ఎత్తున పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు, ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు, రుణ లభ్యత తగ్గిపోవడం, ఉత్పాదక రంగం డీలాపడటం, నిరుద్యోగం వంటివి సవాల్‌గా మారుతాయి.