బోధన్, ఏప్రిల్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుకవారం బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకులు ఏఆర్ రెడ్డి, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు దొడ్డిదారిన సంస్థను నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా ఆర్టీసీపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల పేరిట డ్రైవర్లుగా స్థానిక ఉద్యోగులను కాకుండా, ఇతర రాష్ర్టాల వారిని నియమిస్తున్నారని మండిపడ్డారు.
వారికి సరైన అనుభవం లేని కారణంగా బస్సులు కాలిపోవడం, ప్రమాదాలకు గురవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే సుమారు 18వేల మంది ఉద్యోగులను కుదించారని పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో నిష్ణాతులైన ఉద్యోగులు ఉన్నారని, కేంద్రంతో కుమ్మక్కైన రాష్ట్ర ప్రభుత్వం, అవే నిధులను తమకు కేటాయిస్తే ఆధునీకరించిన బస్సులను మన కార్మికులే తయారు చేస్తారని తెలిపారు. తమ సమస్యలు సకాలంలో పరిష్కరించని పక్షంలో ఈనెల 22 నుంచి సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు. ధర్నాలో జేఏసీ జల్లా నాయకుడు వందేమాతరం శ్రీనివాస్, బోధన్ నాయకులు సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్, మాక్లూర్ శేఖర్, సాయిలు, డి. సంజీవ్, గంగారాం, కొండల్ రావు, పోతారెడ్డి, జీఎన్ గౌడ్, అనీఫ్, ముఖీం, బాబూరావు, యాదగిరి, నవీన్, కిశోర్, మాజీద్ పాల్గొన్నారు.
బాన్సువాడ, ఏప్రిల్ 17: ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ థామస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించిన సమ్మె సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.