Delimitation | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్‌ను చేపట్టాలన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు బ్యాక్‌ఫైర్ అయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్‌లో అవసరమైన మెజారిటీని సాధించలేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. అయితే, మహిళలకు చట్టసభలో మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన’ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి మహిళా బిల్లును మోదీ ప్రభుత్వం ఒక ఆయుధంగా వాడుకొన్నదని, తద్వారా మహిళలను ఆకర్షించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బిల్లు వీగిపోవడంతో మోదీ సర్కార్ స్వార్థపూరిత చర్యలను పసిగట్టిన మహిళా లోకం ఇప్పుడు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నట్టు చెప్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీకి 23న ఎన్నికలు జరుగనున్నాయి. 23వ తేదీతో పాటు 29న రెండు దఫాల్లో బెంగాల్ అసెంబ్లీకి కూడా పోలింగ్ జరుగనున్నది. ఈ రెండు పెద్ద రాష్ర్టాల్లో ముఖ్యంగా బెంగాల్లో పట్టును సాధించడానికి బీజేపీ గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మహిళా ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి వీలున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నది. మహిళలకు నెలకు రూ.3 వేల సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలు ఇందులో భాగమే. అయితే, ఎన్నికల్లో గట్టి పోటీ ఉండటంతో ఇంకా ఏదో చేయాలని బీజేపీ అధినాయకత్వం భావించినట్టు, ఇందులో భాగంగానే ఎప్పుడో పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల అంశాన్ని మళ్లీ తెరమీదికి తీసుకొచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పోలింగ్‌కు సరిగ్గా ఐదారు రోజుల ముందు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో చర్చ పెట్టి, మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టాలని బీజేపీ ఎత్తుగడ వేసినట్టు చెబుతున్నారు. అందుకే, ఆగమేఘాలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్టు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లు, సాధికారతపై ఏ పార్టీ కూడా బాహాటంగా వ్యతిరేకించలేదు. ఒకవేళ, వ్యతిరేకిస్తే ఆ పార్టీపై మహిళా వ్యతిరేక పార్టీగా ముద్రవేసి ఎన్నికల్లో అతివల సానుభూతిని గెలుచుకోవచ్చని బీజేపీ భావించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
మహిళా రిజర్వేషన్లను ముందు పెట్టి ఎప్పటి నుంచో తాము అనుకొంటున్న డీలిమిటేషన్ బిల్లును కూడా పనిలోపనిగా తీసుకురావాలని బీజేపీ అధినాయకత్వం భావించింది. డీలిమిటేషన్ బిల్లును విడిగా తీసుకొస్తే, దక్షిణాది రాష్ర్టాల నుంచి వ్యతిరేకత రావొచ్చేమోనని గ్రహించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో అటు మహిళా రిజర్వేషన్లు, ఇటు డీలిమిటేషన్‌ను వ్యూహాత్మకంగా మిళితం చేసింది. అయితే, ఈ విషయాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ వంటి విపక్ష పార్టీలు.. మహిళా బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని బేషరతుగా ప్రకటిస్తూనే.. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ చేపడితే వ్యతిరేకిస్తామని కుండబద్దలు కొట్టాయి. అయినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకే వెళ్లింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. లోక్‌సభ ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించలేక ఈ బిల్లు వీగిపోయింది. దీంతో బీజేపీ సర్కార్ అసలు నాటకాన్ని మహిళలు కూడా పసిగట్టారు. అందుకే, మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకోలేదని, డీలిమిటేషన్‌తో ముడిపెట్టి మహిళలకు బీజేపీ సర్కారే అన్యాయం చేసిందని సోషల్‌మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.