Women’s Reservation Bill | హైదరాబాద్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ): పురుషాధిపత్య పార్లమెంట్లో ‘ఆమె’కు మళ్లీ పరాభవమే ఎదురైంది. చట్టసభల్లో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించే బిల్లు వీగిపోయింది.
రాజకీయ పార్టీలన్నీ మద్దతిస్తున్నట్టే ప్రకటిస్తున్నా, అడుగు ముందుకు పడటం లేదు. ప్రతిపాదించడం, అడ్డుకోవడం, మరుగున పడటం ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు.. 30 ఏండ్ల నుంచీ ఇదే తంతు. మహిళా బిల్లు మీద ఒక్క అడుగు ముందుకు పడితే 100 అడుగులు వెనక్కి పడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఎజెండాలో మహిళల హక్కులను సమిధలుగా మారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి 2023లోనే నారీ శక్తి వందన అధినియం బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. అయినా కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతోపాటు మహిళా రిజర్వేషన్ల బిల్లును ముడిపెట్టి ఆమెను మరోసారి మోసం చేసిందని రాజకీయ పరిశోధకులు విమర్శిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లును తొలిసారిగా 1996 సెప్టెంబర్ 12న దేవెగౌడ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టింది. 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొన్నది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇందులో ప్రతిపాదించింది. ఈ 33 శాతం రిజర్వేషన్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉప-రిజర్వేషన్లు కల్పించే నిబంధన ఉన్నది. ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించలేదు. ప్రతి లోక్సభ ఎన్నికల తర్వాత రిజర్వ్డ్ స్థానాలను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్డ్ సీట్లు కేటాయించవచ్చని పేర్కొన్నారు. కానీ ఆ బిల్లు ఆమోదం పొందలేదు. దాన్ని రూపొందించినప్పుడు గీతా ముఖర్జీ నాయకత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏడు సూచనలు చేసింది. వీటిల్లో ఐదింటిని బిల్లులో చేర్చి అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం 1998లో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో మళ్లీ ప్రవేశపెట్టింది. అయితే ఎన్డీయే కూటమికి మద్దతిచ్చిన కొన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. దీంతో బిల్లు ఆమోదం పొందలేకపోయింది. వాజపేయి ప్రభుత్వం 1999, 2002, 2003-04లో కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి ప్రయత్నించినా సఫలం కాలేదు.
ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2008లో 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. దీనికి పెద్దల సభ ఆమోదం తెలిపింది. బీజేపీ, వామపక్షాలు, జేడీయూ మద్దతు తెలిపాయి. కానీ యూపీఏ ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. కూటమి భాగస్వాములైన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ వ్యతిరేకించడంతో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. కాదంటే తమ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ భయపడిందని ప్రచారం జరిగింది. 2008లో బిల్లును స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ పరిశీలనకు పంపారు. అయితే వీరిలో ఇద్దరు సభ్యులు వీరేంద్ర భాటియా, శైలేంద్ర కుమార్ సమాజ్ వాదీ పార్టీ నాయకులే. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాకున్నా బిల్లు రూపొందించిన తీరుతో ఏకీభవించలేదని వారు తెలిపారు. 2010లో పార్లమెంట్లోకి 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టారు కానీ చట్టంగా మారలేదు. 2014లో ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకుండానే లోక్సభ గడువు ముగిసింది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 19న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు ప్రవేశపెట్టింది. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. 128వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు 2023 నారీ శక్తి వందన్ అధినియం ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్సభలో సెప్టెంబర్ 20న ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లు 21న కేంద్ర మంత్రి మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. 2023 సెప్టెంబర్ 21న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నది. తాజాగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెడుతూ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్సభలో 2/3 మెజారిటీ సాధించలేకపోయింది.
