వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టడం.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలుకడం.. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన ను పొద్దస్తమానం కీర్తించడం.. హైదరాబాద్ అభివృద్ధి ప్రదాతగా చిత్రీకరించడం.. తెలంగాణలో టీడీపీ మళ్లీ వేళ్లూనుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తీకరించడం.. బీఆర్ఎస్ గద్దెలను ధ్వంసం చేయాలని టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం.. తెలంగాణ రాజధాని నడిబొడ్డుపై వరుసబెట్టి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించడం.. మరోవైపు, అదే సమయంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విస్మరించడం.. ఇంకోవైపు, తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని బక్కని నర్సింహులు చేత మహానాడు వేదిక మీద చెప్పించడం.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని చప్పట్ల మధ్య లోకేశ్ చెప్పుకోవడం.. ఆంధ్ర అధికారులను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడం, సలహాదారులుగా నియమించుకోవడం.. ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మీద కేసులు.. తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులపై బూతులు.. ఇవన్నీ యాదృచ్ఛికంగానో, యథాలాపంగానో జరుగుతున్నవి కాదు. ఆయా మాటలు, చేష్టలు, తాజా పరిణామాలు తెలంగాణపై ఆంధ్ర పెత్తందారీతనాన్ని రుద్దుతున్న తీరుకు సంకేతాలు.. ఆంధ్రా దురాక్రమణకు నిదర్శనాలు!
ఇప్పటికీ తెలంగాణ వనరులను కొల్లగొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని తెలంగాణ సమాజం మండిపడుతున్నది. సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తిని పాతరేసి తెలుగుదేశం పార్టీకి జాతర చేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. గోదావరి, కృష్ణజలాల దోపిడీకి యథేచ్ఛగా పాల్పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణను దాసోహం చేస్తున్నారని విమర్శిస్తున్నది. తెలంగాణ బిడ్డలైన ప్రొఫెసర్ కే నాగేశ్వర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి వంటి అనేకమందిపై ఆంధ్రప్రదేశ్ మూకలు పేట్రేగుతున్న సందర్భంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం కుర్చీలో ఉన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ సహజ, మానవ వనరుల పరిరక్షణే ధ్యేయంగా నిలబడాల్సిందిపోయి దొంగలకు సద్దిగట్టే పాత్రను పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరిపై బనకచర్ల రూపంలో తెలంగాణ హక్కును హరించి వేస్తుంటే నోరుమెదపకుండా రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాధినేతగా కాకుండా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నట్టనడిగడ్డపై రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ తెలంగాణ వైతాళికులైన సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణకు హాజరుకాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? రాష్ట్రంలో కొనసాగుతున్నది టీడీపీ పాలనా? కాంగ్రెస్ పాలనా? లేదా రెండు పార్టీల నాయకత్వంలో సాగుతున్న పాలనా? అసలు ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతున్నది? పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూసేందుకు జంకిన శక్తులు ఈ రెండున్నరేండ్లుగా సైర్వవిహారం చేయడంలోని ఆంతర్యం ఏమిటీ? వంటి ప్రశ్నలు తెలంగాణ సమాజాన్ని తొలుస్తున్నాయి. ఉన్నట్టుండి తెలంగాణలో పేట్రేగుతున్న మూకల నేపథ్యం వెనుక వాటి భవిష్యత్తు కార్యాచరణ తలుచుకుంటే ఆందోళన కలుగుతున్నదని తెలంగాణ సమాజం బెంగటిల్లుతున్నది. వీటికితోడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలు తెలంగాణ భవిష్యత్తును మరింత ఆందోళనకు గురిచేస్తున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఆవిష్కరణ ఎంపిక వెనుక ఆంతర్యం?
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి. ఈ ఇద్దరి జయంతి ఒకేరోజు (మే 28, గురువారం). ఇద్దరి విగ్రహావిష్కరణలు ఒకేరోజు. ఆ రెండు విగ్రహావిష్కరణలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆహ్వానాలు వెళ్లాయి. బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సురవరం ప్రతాపరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాలని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిత్యాందరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి సీఎంను ఆహ్వానించారు. అయితే, కాకతాళీయంగా సురవరం ప్రతాపరెడ్డి, చిన్నారెడ్డి, ప్రొఫెసర్ నిత్యాందరావుదే కాదు, సీఎం రేవంత్‌రెడ్డిది కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాయే.
అయితే, సందర్భం వచ్చిన ప్రతిసారీ తాను నల్లమల పులిబిడ్డను అని ప్రకటించుకొనే రేవంత్‌రెడ్డి తెలంగాణ పులిబిడ్డలా వ్యవహరించకుండా గురువారం తెలుగుదేశం పార్టీకి వంతపాడే కథకుడిగా మారడానికి చంద్రబాబు శిష్యరికమే కారణమా? అని తెలంగాణ మేధావులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణకు వెళ్లకుండా కేవలం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరు కావడం అంటేనే తన ప్రాధాన్యం కేవలం తెలంగాణ మాత్రమే కాదని, తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని తృప్తి పరచడమేనని తన చర్య ద్వారా సీఎం రేవంత్ నిరూపించారనే వాదన వినిపిస్తున్నది. అందులో భాగమే సురవరం స్ఫూర్తిని పాతరేసి..టీడీపీ జాతరను తెలంగాణలో సీఎం రేవంత్ కలగంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వరుస ఘటనలు..వెల్లడిస్తున్న నిజాలు
‘వద్దన్న పనిని బాజాప్తా చేస్తా… ప్రజలు నొచ్చుకొనే పనిని నేను ఇష్టంగా చేస్తా’ అన్నట్టే రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నదా? అంటే రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న వరుస ఘటనలు నిరూపిస్తున్నాయనే వాదన వినిపిస్తున్నది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ఏమాత్రం విలువ ఇవ్వకపోగా ఆయా సందర్భాల్లో అవహేళన చేసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ విగ్రహాలు హైదరాబాద్‌లో నెలకొల్పడం, వాటిని ఆ ఆవిష్కరించిన సందర్భాల్లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరమే కాకుండా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. మరోవైపు, ఈ మట్టి బిడ్డలైన ప్రొఫెసర్ కే నాగేశ్వర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి వంటివారిపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కాలకూట విషాన్ని చిమ్మడం వెనుక తెలంగాణను తిరిగి మరో ప్రమాదంలోకి ఉద్దేశపూర్వకంగా జారగొడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మొత్తంగా గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నాయి.
పిలిచినా పోలే!

ఈ నెల 28న బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణ ఉన్నదని, ఈ కార్యక్రమానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వాన పత్రం అందిస్తున్న విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ నిత్యానందరావు. కానీ ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరుకాలేదు.