హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో పర్యావరణ విప్లవాన్ని సృష్టించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ (జీఐసీ) పాఠాలు ప్రపంచ దేశాలకు బోధిస్తామని మాజీ ఎంపీ, ఇగ్నైటింగ్మైండ్స్ చైర్మన్ సంతోష్‌కుమార్ తెలిపారు. ‘వసుధైక కుటుంబం’ అనే భావనతో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని, జీఐసీ మాడల్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ పునరుద్ధరణలో ప్రజల భాగస్వామ్యమే తమ విజయ రహస్యమని చెప్పారు. లండన్‌లోని మార్ల్‌బరో హౌస్ లో కామన్వెల్త్ సెక్రటేరియట్లో శుక్రవారం సంతోష్‌కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమైంది. వాతావరణ మార్పుల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్యాదవ్తో జరిగిన ఈ చర్చల్లో.. భారతదేశంలో విజయవంతమైన పర్యావరణ నమూనాలను గ్లోబల్ సౌత్ దేశాలకు (దక్షిణాది దేశాలు) విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2011లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రారంభమైన ఈ ఉద్యమం గడిచిన 15 ఏండ్ల లో అసాధారణ ఫలితాలను సాధించిందని సంతోష్‌కుమార్ వివరించారు.
సమావేశంలో పర్యావరణ ఆర్థిక వ్యవస్థపై లోతైన చర్చ జరిగింది. ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.4 ప్రకారం కార్బన్ క్రెడిట్ వ్యవస్థలో భాగస్వామ్యం పై చర్చించారు. బ్లాక్‌చైన్ ఆధారిత ‘భారత్ రీజెనరేషన్ ఇండెక్స్’ ద్వారా ప్రాజెక్టుల ధ్రువీకరణకు గల అవకాశాలను పరిశీలించారు. సుందర్బన్ వంటి ప్రాంతాల్లో మాంగ్రోవ్ (మడ అడవుల) పెంపకాన్ని బ్లూ కార్బన్ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఇగ్నైటింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు ఎం కరుణాకర్‌రెడ్డి, గ్రీన్ చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవల్ల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.