రంగారెడ్డి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : ఫార్మాసిటీ భూసేకరణపై శుక్రవారం మేడిపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగచర్చ ఉద్రిక్తతకు దారితీసింది. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శుక్రవారం మేడిపల్లికి వెళ్లేందుకు ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ, మంచాల, ఇబ్రహీంపట్నం సీఐలు మహేందర్‌రెడ్డి, మధు ఆధ్వర్యంలో పోలీసులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కిషన్‌రెడ్డితో పాటు పార్టీ కార్యాలయంలోనే ఉన్న క్యామ మల్లేశ్, సత్తు వెంకటరమణారెడ్డి, దండెం రాంరెడ్డి, మంచిరెడ్డి ప్రతాప్‌రెడ్డి తదితరులను పార్టీ కార్యాలయం నుంచి బయటికెళ్లకుండా కట్టడిచేశారు. పోలీసులు ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మేడిపల్లికి వెళ్లకుండా ఉంచినా ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డితోపాటు యాచారం మండలపార్టీ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మంచాల మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్, పార్టీ నాయకుడు రాజునాయక్‌తో పాటు అనేకమంది మేడిపల్లికి చేరుకున్నారు. చెక్‌పోస్టుల వద్దకు రాగానే వారందరినీ పోలీసులు అరెస్టుచేసి కందుకూరు, మహేశ్వం పోలీస్ స్టేషన్లకు తరలించారు.
యాచారం మండలం మేడిపల్లిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు గ్రామంలో 144సెక్షన్ విధించారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకోసం పెద్ద ఎత్తున టెంట్లను వేయడంతో కాంగ్రెస్ నాయకులు టెంట్ల వద్ద సర్పంచ్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు టెంట్లను తొలగించి, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రశాంత్కుమార్రెడ్డితో పాటు పలువురు నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా యాచారం, ఇబ్రహీంపట్నం మండల కేంద్రాల్లోని నాగార్జునసాగర్ రహదారిపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.