నిజామాబాద్ : తెలంగాణ ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెడుతుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పిలుపు మేరకు రైతులు వరి సాగును తగ్గించారని, గతంలో ఉన్న నిల్వ ఉన్న బియ్యాన్ని కొనకుండా కేంద్రం బుకాయిస్తోదన్నారు. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేస్తూ వస్తోందన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 26 నుంచి అన్ని గ్రామాల్లో, 27న మండల పరిషత్‌ల్లో, 30న జిల్లా పరిషత్‌లలో తీర్మానాలు చేస్తామన్నారు.
అయినా కేంద్రం వినకుంటే తెలంగాణ ఉద్యమం తీరులో నిరసనలు చేపడుతామన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగుకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నామన్నారు. పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ సైతం ధాన్యం కొనుగోలు చేయాలని ఇమాండ్ చేశారు. రైతులను అన్నివిధాలా ఆదుకుంటూ ప్రభుత్వం వారికి దగ్గరవుతుందని, టీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ఇక్కడి వడ్లు కొంటలేదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కళ్లు తెరవాలని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరమన్నారు.
ప్రతి రోజూ టీఆర్ఎస్ను మంత్రులు సీఎంలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని.. మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ప్రజాధారణ తగ్గిందని మరిచిపోవద్దన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. హిందూ ముస్లింలను సమానంగా చూసిన వ్యక్తి శివాజీ అని, ఆయన చరిత్రను బీజేపీ వక్రీకరించిందని, కశ్మీరి ఫైల్స్‌లో చూపిన సంఘటనలన్నీ ఎన్డీఏ హయాంలో జరిగినవేనన్నారు.