నాగర్‌కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు(Super Luxury Bus) అక్కమ దేవి ఘాట్ రోడ్డు( Srisailam Ghat road) లోని మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా తిరిగింది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం దిశగా బయలుదేరిన బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో అక్కమ దేవి మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు రోడ్డుపై అడ్డంగా తిరిగిపోవడంతో ఘాట్ రహదారిపై రెండు గంటలకు పైగా భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.