Bihar polls : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఎన్డీయే కూటమికి 60 సీట్లు కూడా రావని ఆర్జేడీ (RJD) విమర్శించింది. బీహార్లో 160 స్థానాల్లో గెలుస్తామని ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారని, అది జరిగేపని కాదని ఆర్జేడీ నేత (RJD leader) మృత్యుంజయ్ తివారి (Mrityunjay Tiwari) ఎద్దేవా చేశారు. ఎన్డీఏ అరాచక పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు పలువురు ఎన్డీయే నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆ అహంకారాన్ని ప్రజలు ఇంకా భరించే స్థితిలో లేరని తివారి అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ నెల 6న తొలి విడతలో భాగంగా 121 స్థానాల్లో పోలింగ్ జరుగనుందని, ఆ 121 అసెంబ్లీ స్థానాల్లో 90 స్థానాలను మహాగఠ్బంధన్ గెలువబోతున్నదని చెప్పారు. కాగా బీహార్లో రెండో విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనుంది. రెండో విడతలో 122 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 14న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.