అమరావతి : కార్తిక పౌర్ణమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గోవిందుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ ( TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67, 091 మంది దర్శించుకోగా 21,111 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.42 కోట్లు ఆదాయం ( Hundi Income) వచ్చిందన్నారు.
ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో


తిరుపతిలోని వేంకటేశ్వర గోశాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ( EO Anil Kumar Singhal) పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న దాణా, వసతి, వైద్యం, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలను ఇన్చార్జి డైరెక్టర్ డి. పణికుమార్ నాయుడు వివరించారు. దాదాపు 500 గోవులకు ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని, గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించారు. గోశాలలో పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు, అగరబత్తిల యూనిట్ వంటి కార్యాకలాపాలను ఈవో పరిశీలించారు. గోశాల, అగరబత్తిల యూనిట్ లోని సిబ్బందితో ఈవో మాట్లాడారు.