AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులను గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీపీడీవో)గా మార్చింది.. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీసుకునే వేతనాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రస్తుతం ఉన్న ఐదు కేడర్లను నాలుగు కేడర్లకు కుదించింది.
జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరిస్తూ గత నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన అంశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం జీవో జారీ చేశారు. దీని ప్రకారం ఇప్పటివరకు అమలులో ఉన్న 7244 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పనిచేయనున్నాయి. వీటిని 359 అర్బన్ పంచాయతీలు, 3082 గ్రేడ్ 1 పంచాయతీలు, 3163 గ్రేడ్ 2 పంచాయతీలు, 6747 గ్రేడ్ 3 పంచాయతీలుగా వర్గీకరించారు. వీటికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రత్యేక ఆదేశాలను ఇస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.