Nara Bhuvaneshwari | ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్లోని మే ఫెయిర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును నారా భువనేశ్వరికి ఐవోడీ ప్రతినిధులు అందజేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ -సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గానూ నారా భువనేశ్వరికి ఈ అవార్డును అందజేశారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ‘ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డునూ ఇదే వేదికపై నారా భువనేశ్వరికి నిర్వాహకులు అందజేశారు.
నారా భువనేశ్వరి అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు భువనేశ్వరి దూరదృష్టి, కృషి, సేవాభావానికి నిదర్శనమని కొనియాడారు. భువనేశ్వరి విలువలు, సేవాస్ఫూర్తి మనందరికీ ఆదర్శం, ప్రేరణ అని అన్నారు.