ఆదిలాబాద్ టౌన్, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 ఏండ్లు పైబడిన వారికి మంగళవారం ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నది. వీరు రాష్ట్రం లో ఎక్కడికైనా ప్రయాణించేలా వెసులుబాటు కల్పించింది. భోజన వసతి కూడా సమకూర్చుతున్నది. వీరు ఆధార్ కార్డు వెంట ఉంచుకోవాల్సిందిగా తెలిపింది. రిజర్వేషన్ బస్సుల్లో కూడా అదనంగా సీట్లు ఉంచుతున్నది. అలాగే గర్భిణులు, బాలింతల కోసం పల్లె వెలుగు బస్సుల్లో 4, 6 నంబర్ సీట్లు, ఎక్స్‌ప్రెస్‌లో 1, 2 సీట్లను అందుబాటులో ఉంచింది. అలాగే మార్చి 1 నుంచి 31 వరకు ప్రయాణించే మహిళల కోసం గిఫ్ట్ స్కీం కూడా పెట్టింది. వారు ప్రయాణించే బస్సు టికెట్ వెనుక ఫోన్ నంబర్ రాసి, బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2న డ్రా తీసి, గిఫ్ట్‌లు అందజేయనున్నది. స్వయం సహాయక సభ్యుల కోసం బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకున్న మహిళలకు నెలపాటు హెవీ వెహికిల్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించనున్నది. ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీ చరిత్రలోనే మొదటి సారిగా ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 94409 70000ను ఏర్పాటు చేసింది. సంస్థ అందిస్తున్న ఈ సౌకర్యాలను మహిళలు వినియోగించుకోవాలని ఆదిలాబాద్ ఆర్ఎం ప్రభులత, డిపో మేనేజర్ జనార్దన్ సూచించారు.