Mohan Bhagwat | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. మనలో దేవుడు ఉన్నాడా? లేదా? అన్నది ప్రజలు నిర్ణయించాలని, మనకు మనం దేవుడిగా అనుకుంటే సరిపోదంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి భగవత్ పరోక్షంగా పై వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పూణెలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ.. ‘ప్రతీ ఒక్కరూ సాధ్యమైనంత మేరకు మంచి పనులు చేయాలి. మంచి పనులతో మనం కీర్తి సంపాదించామో లేదో.. నిర్ణయించాల్సింది ప్రజలు. అంతేగానీ, మనకు మనమే దేవుడిగా అనుకొంటే సరిపోదు. మనం దేవుడా? కాదా? అన్నది నిర్ణయించాల్సింది ప్రజలే’ అని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తనకు తాను దైవాంశసంభూతుడిగా అభివర్ణించుకొన్నారు. తాను భగవంతుడు పంపిన దేవ దూతగా చెప్పుకొచ్చారు.