‘ఏక్ బార్ పింగ్లే నే కహా థా. 75 వర్ష్ కే హోనేకే బాద్ అగర్ ఆప్కో శాల్ దేకర్ సమ్మానిత్ కియా జాతా హై, ఇస్కా మత్లబ్ హైకీ ఆప్కో అబ్ రుక్ జానా చాహియే! ఆప్కీ ఆయూ హో చుకీ హై! హట్ జాయీయే.. ఔర్ దూస్రోకో ఆగే ఆనే దీజియే! (ఒకసారి పింగ్లే ఇలా అన్నారు.. మీకు 75 ఏండ్లు వచ్చిన తర్వాత, శాలువా కప్పి సన్మానం చేశారంటే, ఇక దిగిపోవలసిన సమయం వచ్చింది. మీ వయసు అయిపోయింది. పదవి నుంచి తప్పుకుని, వేరేవాళ్లకు అవకాశం ఇవ్వమని అర్థం)’
– నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాజకీయ నాయకుల రిటైర్మెంట్ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే 75 ఏండ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని, వేరే వాళ్లకు పని చేసే అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బుధవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగవత్ పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో రిటైర్మెంట్పై సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే అన్న వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ‘ఏక్ బార్ పింగ్లే నే కహా థా.. 75 వర్ష్ కే హోనే కే బాద్ అగర్ ఆప్కో శాల్ దేకర్ సమ్మానిత్ కియా జాతా హై, ఇస్కా మత్లబ్ హై కీ ఆప్కో అబ్ రుక్ జానా చాహియే, ఆప్కీ ఆయూ హో చుకీ హై, హట్ జాయీయే ఔర్ దూస్రో కో ఆగే ఆనే దీజియే (ఒకసారి పింగ్లే ఇలా అన్నారు.. మీకు 75 ఏండ్లు వచ్చిన తర్వాత, శాలువా కప్పి సన్మానం చేశారంటే, ఇక దిగిపోవలసిన సమయం వచ్చింది. మీ వయసు అయిపోయింది. పదవి నుంచి తప్పుకుని, వేరేవాళ్లకు అవకాశం ఇవ్వాలని అర్థం)’ అని పింగ్లే వ్యాఖ్యలను ఉటంకిస్తూ భాగవత్ అన్నారు. పింగ్లే ఎంతో అంకితభావంతో దేశానికి సేవ చేశారన్న భాగవత్.. నిర్దిష్ట వయస్సు రాగానే పదవి నుంచి గౌరవంగా దిగిపోవాలన్న సిద్ధాంతాన్ని పింగ్లే బలంగా నమ్మారని గుర్తు చేశారు. ప్రస్తుతం భాగవత్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది.
ప్రతిపక్షాల విమర్శలు
భాగవత్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీ నేతలు స్పందించారు. ప్రధాని మోదీని ఉద్దేశించే భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ అన్నారు. ‘పలు అవార్డులు తీసుకొని, విదేశీ పర్యటనలు ముగించుకొని భారత్‌కు వస్తున్న ప్రధాని మోదీకి ఎలాంటి స్వాగతం లభించిందో చూడండి. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏండ్లు పూర్తవుతాయన్న విషయాన్ని ఆరెస్సెస్ చీఫ్ గుర్తు చేస్తున్నారు. కానీ, భాగవత్‌కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 75 ఏండ్లు నిండుతాయన్న విషయాన్ని మోదీ కూడా ఆయనకు గుర్తు చేయాలి. ఒక్క దెబ్బకు.. రెండు పిట్టలు’ అని జైరాం రమేశ్ పోస్ట్ పెట్టారు. ‘75 ఏండ్లు నిండగానే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జశ్వంత్ సింగ్‌తో మోదీ బలవంతంగా పదవీ విరమణ చేయించారు. అదే రూల్‌ను మోదీ ఇప్పుడు తనకు అన్వయించుకొంటారో లేదో చూడాలి’ అని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
అమిత్ షా రిటైర్మెంట్ ఇలా..
యాదృచ్చికమో మరేమో గానీ.. రిటైర్మెంట్పై బుధవారం నాగ్‌పూర్‌లో ఒకవైపు భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేయగా.. అదే రోజు అహ్మదాబాద్‌లో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, హోంమంత్రి అమిత్‌షా కూడా తన పదవీ విరమణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రిటైరయ్యాక శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులు చదవడానికి, ప్రకృతి సేద్యం చేయడానికి వెచ్చిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం అమిత్ షా వయసు 60 ఏండ్లు. కాగా.. బీజేపీలో రిటైర్మెంట్ వయసు గురించి అమిత్ షా గతంలోనూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 75 ఏండ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వబోమని, ఇది పార్టీ నిర్ణయమని 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ది వీక్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా తేల్చిచెప్పారు. దీంతో బీజేపీలో రిటైర్మెంట్ వయసు 75 ఏండ్లు అన్న చర్చ పెద్దయెత్తున జరిగింది.
ప్రధాని మోదీని ఉద్దేశించేనా?
ఈ ఏడాది సెప్టెంబర్ 17తో ప్రధాని మోదీకి 75 ఏండ్లు నిండుతాయి. దీంతో మోదీని ఉద్దేశించే భాగవత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోదీ నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. గడిచిన 11 ఏండ్లలో ప్రధాని హోదాలో ఆయన ఈ కార్యాలయానికి రావడం అదే తొలిసారి. ఈ క్రమంలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ నియమాల ప్రకారం.. 75 ఏండ్లకు రిటైర్ కావాలి. సెప్టెంబర్‌లో తాను దిగిపోనున్నట్టు లేఖ ఇవ్వడానికే మోదీ ఈ కార్యాలయానికి వచ్చారేమో’ అని ఆయన అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ప్రధాని మోదీ వారసుడిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరును కొందరు తెరమీదకు తీసుకొస్తున్నారు. అయితే, ఈ వాదనను ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ఇదిలాఉండగా.. ఆరెస్సెస్ చీఫ్ పదవికి ఎలాంటి వయసు పరిమితి లేదని, స్వచ్ఛందంగానే దిగిపోవడం తప్ప ఏజ్ లిమిట్ అనేది లేదని నాగ్‌పూర్ యూనివర్సిటీ పూర్వ అధ్యాపకులు, ఆర్థికవేత్త డాక్టర్ శ్రీనివాస్ ఖందేవాలే అన్నారు. అయితే, బీజేపీలో అనధికారికంగా రిటైర్మెంట్ వయసు అనేది మాత్రం ఉన్నదని ఆయన గుర్తు చేశారు.