వంగూరు, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అచ్చంపేట ఎమ్మెల్యేతో అవమానానికి గురైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజా ల సర్పంచ్ కాశమ్మను శనివారం రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ పరామర్శించారు. అనంతరం పోతారెడ్డిపల్లి శివారులోని దుందుభి వాగులో సాగుతున్న ఇసుక అక్రమ రీచ్‌లను పరిశీలించారు.
విద్యుత్తు సరఫరా, సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టాలు ఇచ్చిన అధికారాలతో జాజాల సర్పంచ్ తన హక్కులను ఉపయోగించి గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతుంటే.. మహిళా సర్పంచ్‌ను అవమానించడం ఎమ్మెల్యే వంశీకృష్ణకు తగదని అన్నారు. సీఎం సొంత మండలంలో ఓ దళిత మహిళా సర్పంచ్ వివక్షకు గురవుతుంటే రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడం వారి పాలనకు నిదర్శనమని అన్నారు. సర్పంచ్‌కు వచ్చే బిల్లులను ఇప్పించి ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు.
దుందుభి వాగులో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించడం వెనుక సీఎం కుటుంబ సభ్యులు, అనుచరుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. నిజంగా అనుమతులు ఉంటే పట్టపగలు రవాణా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మైనింగ్ అధికారులు నీళ్లు నములుతున్నారని, ఇది ముమ్మాటికీ అక్రమ మైనింగ్ సాగుతున్నట్టేనని పేర్కొన్నారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో 24 గంటల విద్యుత్తు అందుతుండగా.. పక్కనే ఉన్న పోల్కంపల్లి, ఇతర గ్రామాలకు 9 గంటల కరెంట్ మాత్రమే సరఫరా చేయడమంటే రైతులను మోసం చేయడమేనని అన్నారు.