కరీంనగర్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కండ్ల ముందే పంటలెండిపోతుంటే కడుపు మండిన రైతులు పోరుకే సిద్ధమవుతున్నరు. సాగునీరు ఇవ్వడంలో సర్కార్ నిర్లక్ష్యంపై ఏకంగా తిరుగుబాటుకే దిగుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన అన్నదాతల తెగింపు.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజుకున్నది. ఆ పోరుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తున్నది.
రాష్ట్రంలో సాగైన పంటపొలాల్లో ఒక్క ఎకరం ఎండినా ఊరుకోబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలతో, గోదావరి నీటిని లిఫ్ట్ చేసి కాళేశ్వరం రిజర్వాయర్లను నింపి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు లేఖ రాయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. రైతు ఉద్యమాలు ఉగ్రరూపం దాల్చి చివరకు అవి సర్కార్ చేతుల్లో లేకుండా పోతాయని ఇంటెలిజెన్స్ నివేదికలు సర్కార్‌ను హెచ్చరిస్తున్నాయి. ఫలితంగా ఎట్టకేలకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగుతున్నది. అన్నదాత మొదటిపేజీ తరువాయి…
పోరాటం, బీఆర్ఎస్ హెచ్చరికలతో జూరాల కాలువలకు నీళ్లిచ్చిన సర్కార్.. తాజాగా అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసే కార్యక్రమానికి పూనుకున్నది. తొలుత గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చిన వరద ప్రవాహాన్ని ఒడిసి పట్టకుండా చోద్యం చూసిన సర్కార్.. ఇప్పుడు దిక్కులు చూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. సాగునీరివ్వడంలో జాప్యం కారణంగా జూరాల ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన అన్నదాతల పోరు.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నది. అది తీవ్రమై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి దారితీసే అవకాశం ఉన్నది. రైతుల న్యాయమైన డిమాండ్‌కు బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్షాలు మద్దతుగా నిలుస్తుండటంతో సర్కార్ కొంత దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్టుగా కనిపిస్తున్నది.
సాగునీటి కోసం జూరాల ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన రైతు ఉద్యమం.. ఇప్పుడు అన్ని సాగునీటి ప్రాజెక్టులకూ పాకుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాల్లేక, పంటలు పొట్ట దశకు వచ్చి ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూరాల ప్రాజెక్టులో నీటినిల్వలు తక్కువగా ఉన్నాయని పేర్కొంటూ తాగునీటి అవసరాలకే సర్కార్ నీటిని విడుదల చేసింది. దీనిపై ఆగ్రహించిన రైతులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని ధర్నాలు, రోడ్డు దిగ్బంధనాలు చేశారు. ఒక దశలో ఆగ్రహించిన కొంతమంది రైతులు అధికారుల పహారాను దాటి, స్వయంగా ఎడమ కాలువ రెగ్యులేటర్ గేట్లను పైకి లేపి నీటిని విడుదల చేసుకున్నారు. వాటిని అధికారులు వెంటనే మూసివేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. బీఆర్ఎస్తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలిచి, కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో పలువురు విపక్ష నేతలను పోలీసులు అరెస్టు, గృహనిర్బంధం చేశారు. రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆమేరకు నీటి విడుదలను సాధించుకున్న విషయం తెలిసిందే.
జూరాల రైతు ఉద్యమ తీరు ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల పరిధిలోని రైతాంగానికి స్ఫూర్తిగా నిలిచింది. దీంతో అన్ని ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. గత రెండు, మూడు రోజులు కురిసిన కొద్దిపాటి వర్షం రైతుల అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. రైతు ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతిస్తే.. అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ మరో జూరాల సన్నివేశాలను చవిచూడాల్సి వస్తుందని ఇంటెలిజెన్స్ అధికారులు నివేదికలు పంపినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ఇప్పటికే ఆవేశం కట్టలు తెచ్చుకుంటుందని, సాధ్యమైనంత వరకు సాగునీరు ఇవ్వకపోతే ఉద్యమాలు తప్పవని ఆ నివేదికల్లో హెచ్చరించినట్టు తెలిసింది.
రైతు ఉద్యమాలు ఉగ్రరూపం దాల్చి చివరకు అవి సర్కార్ చేతుల్లోలేకుండా పోతాయని స్పష్టంచేశారు. ప్రాజెక్టులకు వరదలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టుల నింపుతూ రైతుల అవసరాలు తీర్చకపోతే పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో కూడా అంచనా వేయలేమన్న నివేదికను కూడా పంపించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే చాలా గ్రామాల్లో రైతులు సర్కార్‌పై అసహనం వ్యక్తంచేస్తూ సాగునీటికోసం.. అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. మొండివాదనకు వెళ్లి సాగునీటిని ఇవ్వకపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉన్నదని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నది. పూర్తిస్థాయిలో ఎత్తిపోతలను నడిపి సాగుకునీరు ఇస్తారా? లేక మూణ్నాళ్ల ముచ్చటగానే మధ్యలోనే ఆపి మురిపిస్తారా? అనేది మున్ముందు తేలనున్నది. ఒకవేళ మధ్యలోనే బంద్ పెడితే మాత్రం రైతుల నుంచి సర్కార్ రణం ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.
ఎల్లంపల్లి, మధ్యమానేరు ప్రాజెక్టులో ఎగువకు ఎత్తిపోసే స్థాయిలో నీటి నిల్వలు ఉన్నా.. మోటర్లను నిరంతరం నడుపకుండా సర్కార్ ఆన్ ఆండ్ ఆఫ్ పద్ధతిలోనే నడుపుతున్నది. దీనివల్ల మోటర్లు చెడిపోతాయని, నీటినిల్వలు ఉన్నప్పుడు నిరంతరం నడుపాలని నిపుణులు చెపుతున్నా సర్కార్ మాత్రం దానిని పెడచెవిన పెడుతూనే ఉన్నది. దీని వల్ల కాలయాపన చేసే ఉద్దేశమే సర్కార్ వద్ద కనిపిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు, అలాగే అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్‌కు శనివారం ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో పంపులను నడుపడమే దీనికి నిలువెత్తు నిదర్శనం. వీటిని పూర్తిస్థాయిలో నడిపే అవకాశం ఉన్నది. అలా నడిపి త్వరగా నీటిని ప్రాజెక్టుల్లో నింపితే వెంటనే సాగుకు నీరు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. దానిని కాలయాపన చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్న నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడానికి కేసీఆర్ ఏర్పాటుచేసిన కాళేశ్వరం పంపులను పూర్తిస్థాయిలో సద్వినియోగం
మధ్యమానేరుకు 12,600 క్యూసెక్కులు ధర్మారం/రామడుగు/చిన్నకోడూరు, సెప్టెంబర్ 26: గోదావరి జలాలు వృథాకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లోని పంప్‌హౌస్‌లో మోటర్ల సంఖ్యను పెంచి రిజర్వాయర్లు నింపాలని శుక్రవారం మాజీ మంత్రి హరీశ్‌రావు రాసిన లేఖతో సర్కార్ మొద్దునిద్ర వీడింది. నంది, గాయత్రీ పంప్‌హౌస్‌లో మోటర్ల సంఖ్యను పెంచింది. ఈ నెల 15 నుంచి కాళేశ్వరం లింక్-2లో భాగమైన పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్‌లోని నీటిని పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని నంది, కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి తరలిస్తున్నది. ఆయా పంప్‌హౌస్‌ల్లో ఇన్నిరోజులు కరెంట్ కొరత పేరుతో కేవలం రెండు మోటర్లనే ఆన్ చేస్తూ 6,300 క్యూసెక్కుల చొప్పున తరలిస్తూ వచ్చింది.
ఇల్లంతకుంట రూరల్, సెప్టెంబర్ 26: ఎత్తిపోతలతో మధ్యమానేరు జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండగా, ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లోని అన్నపూర్ణ పంప్‌హౌస్‌లో మూడు మోటర్లను ఆన్‌చేసి 8,511 క్యూసెక్కులను అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి 3,300 క్యూసెక్కులను తరలిస్తున్నారు.