హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): డీఎస్పీ భీంరెడ్డి అవినీతి కేసులో రెండు చేపల నీతి కనిపిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. భీంరెడ్డి విషయం లో ఏసీబీ తీరుపై ఆయన సోమవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘చిన్న చేపలకో న్యాయం-తిమింగలాలకు మరో న్యా యం ఉండకూడదు సీఎం రేవంత్ గారు. బంజారాలకు, మాలమాదిగలకు ఒకన్యా యం, భీంరెడ్డికి మరో న్యాయం ఎట్లా?’ అని ప్రశ్నించారు. ‘భీంరెడ్డిపై చూపిన జాలి మిగతా బహుజన బిడ్డలైన వారిపై చూపలేదు.
మా బిడ్డలను కూడా వెంటనే జైలు నుంచి విడుదల చేయండి’ అని డిమాండ్ చేశారు ‘దమ్ముంటే తిమింగలాలను మింగే రాకాసి తిమింగలాలు రేవంత్‌రెడ్డి-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లక్ష కోట్ల చీకటి సామ్రాజ్యాన్ని బహిర్గతం చే యండి. సొర చేపలు, చిరు చేపలు అన్నీ వెంటనే సర్దుకుంటయ్. మసకబారిన మీ ఏసీబీ ప్రతిష్ఠ మళ్లీ తిరిగొస్తుంది. ఐదు రోజుల తర్వాత, డీఎస్పీ భీంరెడ్డిని అరెస్టు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని కులం, పలుకుబడి, బలవంతుల పైరవీల ఆధారంగా కాకుం డా, కూలంకషంగా పరిశోధించిన తరువాతనే, కేసులు పెట్టి, నిజమైన అవినీతిపరులను జైలుకు పంపండి’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.