ఏపీ కోసమే ‘కన్నెపల్లి’ బంద్!
తన గురువు చంద్రబాబు మెప్పు కోసం, ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్నెపల్లి మోటర్లను బంద్ పెట్టి నీళ్లను ఎత్తిపోయలేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎల్ నినో శాపం ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ పాపమేనని, కరువుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థ విధానాలేనని విమర్శించారు.
- కాఫర్‌డ్యామ్ నిర్మాణంపై నిర్లక్ష్యం
- కాంగ్రెస్ వల్లే ఎల్ నినో శాపం
- సీఎం రేవంత్‌రెడ్డే కరువుకు కారణం
- మేడిగడ్డ కుంగుబాటులో కుట్రకోణం
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తన గురువు చంద్రబాబు మెప్పు కోసం, ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్నెపల్లి మోటర్లను బంద్ పెట్టి నీళ్లను ఎత్తిపోయలేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎల్ నినో శాపం ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ పాపమేనని, కరువుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థ విధానాలేనని విమర్శించారు.
గురువారం ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్సాగర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌పై కక్షతోనే మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన పిల్లర్‌కు మరమ్మతులు చేయడం లేదని ఆర్ఎస్పీ దుయ్యబట్టారు. 50 రోజుల్లో కేవలం రూ.30 కోట్లతో కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు ఎత్తిపోసి కరువును తరిమికొట్టే అవకాశాన్ని వదులుకొని, క్రాప్‌హాలిడే ప్రకటించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బరాజ్ అందుబాటులో ఉంటే కరువు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. తన గురువు ప్రాపకం కోసం తెలంగాణ రైతుల ప్రయోజనాలను బలిపెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో 734 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలయ్యాయని విమర్శించారు.
గాఢ నిద్రలో ప్రభుత్వం
ఎల్ నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, భరోసానివ్వాల్సిన ప్రభుత్వం గాఢ నిద్రలో కూరుకొనిపోయిందని ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగుకు నీరందించి భరోసానివ్వాల్సిన ముఖ్యమంత్రి భయంకరమైన కరువు వచ్చిందని, పంటలు వేయొద్దని, తాగేందుకు కూడా నీళ్లు దొరుకవని ప్రజలను భయపెట్టడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. వర్షాలు కురిసినప్పుడు నీటిని ఒడిసిపట్టాల్సిందిపోయి, ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిద్ర మేలుకొని కరువు మండలాలను ప్రకటించి, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల ఆగ్రహజ్వాలల్లో కాంగ్రెస్ సర్కార్ మాడిమసైపోతుందని హెచ్చరించారు.
మేడిగడ్డ కేసును ఎందుకు క్లోజ్ చేశారు?
మేడిగడ్డలోని పిల్లర్ కుంగుబాటు వెనుక కుట్ర కోణం ఉన్నదని ప్రవీణ్‌కుమార్ అనుమానం వ్యక్తంచేశారు. అందుకే 2023 అక్టోబర్ 25న ఇంజినీర్ రవికాంత్ ఫిర్యాదుతో నమోదు చేసిన కేసును క్లోజ్ చేశారని ఆరోపించారు. ఇంతటి కీలకమైన కేసును ఆధారాల్లేవని, తప్పుడు సమాచారం అని, అన్ డిటెక్టివ్ అని 2025లో మూసేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బరాజ్‌ను కంట్రోల్డ్ ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్లు పెట్టి పేల్చివేశారని ఆరోపించారు. కేసు నమోదైన వెంటనే నేరస్థలాన్ని సీజ్‌చేసి పగుళ్లు వచ్చిన పిల్లర్ దగ్గర నమూనాలు సేకరించి, వీడియో రికార్డ్ చేసి, సెల్‌ఫోన్ టవర్స్ లొకేషన్స్ తీసుకొని, కాల్‌డాటా తీసుకొని విశ్లేషించాల్సిందని అభిప్రాయపడ్డారు.
‘జియాలజీ విభాగం ద్వారా సిస్మిక్ డాటా సేకరించాల్సింది. భూకంపం ఏమైనా వచ్చిందా? రిక్టర్సేల్ మీద రీడింగ్ ఎంత నమోదైంది? అనేది తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే డిటోనేటర్లు పేలితే భూకంపం వచ్చినట్టుగా శబ్దం వస్తుంది. ఇది క్లోజ్ చేసే కేసు కాదు. అత్యంత అధునాతన టెక్నాలజీ ఉపయోగించి విచారణ జరుపాల్సిన వ్యవహారం’ అని స్పష్టంచేశారు. మేడిగడ్డ బరాజ్ 25 లక్షల క్యూసెకుల వరదను ఆపగలదని, కానీ పిల్లర్లు కుంగేనాటికి వరద 22 వేల క్యూసెకులు మాత్రమేనని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతిలోనే హోంశాఖ ఉన్నదని, ఈ కేసును క్లోజ్ చేయడానికి ఆయనే కారకుడని ఆరోపించారు. అధికారులు, పోలీసుశాఖ చేతిలో ఉన్నా, విచారణ చేయకపోవడంలోని మతలబేందని నిలదీశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

