హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి అసభ్యకరంగా, నిందాపూర్వకంగా, వ్యక్తిత్వాన్ని దూషించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తీసుకున్నది. ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం షేక్‌పేట ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తదితర నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తే స్వయంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి, ప్రత్యర్థి నేతలపై వ్యక్తిగతంగా, అవమానకరంగా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడమే కాకుండా, ఓటర్లలో ద్వేషం, అనుచిత భావోద్వేగాలు రేకెత్తించే విధంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. శాంతియుత, స్వచ్ఛ, నిష్పాక్షికంగా ఉప ఎన్నికల నిర్వహణ కోసం రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎంకు నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం సీఈవోకు కనిపించడం లేదా? ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడటం కించపరిచినట్టు కాదా?’ అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. దండుపాళ్యం బ్యాచ్ జూబ్లీహిల్స్‌లో తిరుగుతూ, ఎన్నికల ప్రలోభాలకు గురిచేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులను సహించేదిలేదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నేతలు కిశోర్‌గౌడ్, గెల్లు శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.