మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 5: సిద్దిపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. రోడ్లకు మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దూరు మండలంలోని వల్లంపట్ల-ఉప్పరోనిగడ్డ గ్రామాల మధ్య గతంలో రోడ్డు కోతకు గురైంది. సమీప రైతులు, గ్రామస్తులు తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోగా,ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ధూళిమిట్ట మండలం కూటిగల్-వల్లంపట్ల గ్రామాల మధ్య బీటీ రోడ్డు కోతకు గురైంది. చేర్యాల నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు ఇదే రోడ్డుపై ప్ర యాణం చేస్తుంటారు. వర్షాలకు ఈ రెండు రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు రైతులు పాట్లు పడుతున్నా రు. దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
వల్లంపట్ల నుంచి కూటిగల్, ఉప్పరోనిగడ్డలకు వెళ్లే రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. రోడ్లు కోతకు గురికావడంతో వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి.
-వేల్పుల విజయ్‌కుమార్, వల్లంపట్ల, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా