Drinking Water | బెంగళూరు, ఫిబ్రవరి 18 : వేసవికి ముందే కర్ణాటకలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. తాగునీటిని అత్యవసరం కాని వాటికి వాడితే రూ.5 వేలు జరిమానా విధిస్తామని బెంగళూరు వాసులను ఆ నగర నీటి సరఫరా, మురుగు నిర్వహణ బోర్డు హెచ్చరించింది.
వాహనాలను శుభ్రం చేయడానికి, తోటపనికి, భవన నిర్మాణానికి, వినోదానికి, ఫౌంటెన్ల లాంటి అలంకరణ పనులకు తాగు నీటి వాడకాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. మాల్స్, సినిమా హాళ్లు నీటిని కేవలం తాగడానికి మాత్రమే వినియోగించాలని స్పష్టంచేసింది. కొన్ని రోజులుగా నగరంలో వర్షాలు పడకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి తొలిసారి రూ.5 వేలు, ఆ తర్వాత ఉల్లంఘనలకు రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తామని తెలిపింది. నగరంలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటి వృథాను అరికట్టడం అవసరమని బోర్డు పేర్కొంది.