అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కుల వాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు కేవలం 4 కంపార్టుమెంట్ల (Compartments) లో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 67,668 మంది భక్తులు దర్శించుకగో 23,157 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.56 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని వెల్లడించారు.
14 నుంచి 16వ తేదీ వరకు గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 13న అంకురార్పణ నిర్వహించనున్నామని అర్చకులు వివరించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 14న ఉదయం పవిత్రప్రతిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, 15న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ ఉంటుందని పేర్కొన్నారు.
సెప్టెంబరు 16న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తామన్నారు.