రవాణా వ్యవస్థ బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని భావిస్తున్న రాష్ట్ర సర్కారు, ఏజెన్సీ పల్లెలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రోడ్లు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభయారణ్యాన్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో రోడ్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయించగా, రాష్ట్ర వన్యప్రాణి మండలి కూడా ఆమోదం తెలిపింది. అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.26.49 కోట్లతో 27 చోట్ల పనులు చేపట్టనుండగా ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలో అందుబాటులోకి రానుండగా, పలు గ్రామాల ప్రజలకు రవాణా మెరుగుపడడమేగాకుండా వన్యప్రాణులకు సైతం రక్షణ ఏర్పడనున్నది. – ఆదిలాబాద్, ఫిబ్రవరి 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆదిలాబాద్, ఫిబ్రవరి 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో గిరిజన గ్రామాలు, పల్లెలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానకాలంలో రోడ్లన్నీ జలమయంగా మారి రాకపోకలు నిలిచిపోయేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు డబుల్రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు నాలుగువరుసల రహదారులను నిర్మించింది. దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వాహనాలపై తిరుగుతూ పనులు చేసుకుంటున్నారు.
అభయారణ్య గ్రామాలకు రోడ్లు
ఉమ్మడి జిల్లాలో కవ్వాల్ అభయారణ్యం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో దట్టమైన అడవులు, జంతువుల సంచారం ఉంటుంది. నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు ఈ ఆడవికి ఆనుకుని ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ గ్రామాలకు మట్టిరోడ్లు ఉన్నాయి. వానకాలంలో ఈ రోడ్లపై నీటి ప్రవాహం కారణంగా రవాణా నిలిచిపోతుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ రోడ్ల నిర్మాణం, జంతువుల ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి అండర్‌పాస్‌లను నిర్మించాలని అటవీ పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సూచనల మేరకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. నాలుగు జిల్లాల్లో రూ. 26.49 కోట్లతో 27 పనులు చేపట్టనున్నారు. వీటి నిర్మాణాలకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. జంతువులు సంచరించడానికి 30 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో అండర్‌పాస్‌లను నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న మట్టిరోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తారు. వీటి నిర్మాణాలతో పాటు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సౌకర్యం కల్పిస్తారు.
గ్రామాలకు మెరుగైన రవాణా..
అటవీశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 27 పనులు చేపడుతున్నాం. ఇందుకు గానూ రూ.26.49 కోట్లు ఖర్చవుతాయి. రహదారుల నిర్మాణాలతో అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. వానకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు చేయవచ్చు. జంతువులు స్వేచ్ఛగా సంచరించడానికి అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నాం.
– మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి