తొర్రూరు, జూలై 30 : యాపిల్ పండ్లతో వెళ్తున్న డీసీఎం వాహనం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడగా, నిమిషాల్లో జనం పండ్లను లూటీ చేశారు. మాటేడు గ్రామ స్టేజీ సమీపంలోని వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న యాపిల్ లోడ్ డీసీఎం వాహనం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు డీసీఎం వాహనానికి కాపలాగా ఉన్నారు. కానీ ప్రమాదాన్ని చూడటానికి వచ్చిన జనం ఒక్కసారిగా ఎగబడి క్షణాల్లో పండ్లను లూటీ చేశారు. బస్తాలు, సంచులు, ద్విచక్రవాహనాల్లో తరలించుకుపోయారు. దీంతో ఘటనా స్థలం వద్ద కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొన్నది. తొర్రూరు ఎస్సై మహేందర్‌రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.