కాళేశ్వరం/మహదేవపూర్/ఏటూరునాగారం/వాజేడు, జూలై 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమం గా పెరుగుతోంది. గోదావరి-ప్రాణహిత నదులు కలిసి 1,54,700 క్యూసెకుల నీటితో ప్రవహిస్తున్నాయి. ప్రస్తు తం నది 6.78 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండగా, వరద నీరు దిగువకు కొనసాగుతోంది. మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ప్రవాహం 2,12,170 క్యూసెకులకు చేరుకోగా, మొత్తం 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ నీటి ప్రవాహ ఎత్తు సముద్రమట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం సుమారు 91 మీటర్లుగా నమో దైంది.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకుల గూడెం సమ్మక్క బరాజ్ వద్ద 9,36,650 క్యూసెక్కులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 59 గేట్లను ఎ త్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి బ్యాక్ వాటర్ ఉప్పొంగి మండలంలోని వాగులు, ఒర్రెల నుంచి వెనుకకు వస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్న గూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి 11.53 మీటర్లకు చేరుకుంది. ఇక్కడ 14.82 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం 14.720 మీటర్లు(46) అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. దీంతో గోదావరి దిగువ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది ఒడ్డుకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.