సంస్కరణలు కాదు ప్రత్యామ్నాయం కావాలి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారత విద్యార్థి ఉద్యమానికి ఒక ము ఖ్యమైన రాజకీయ విజయం. అయితే ఆయన రాజీనామా లేఖలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తున్నది. పరిపాలనా వైఫల్యాన్ని అంగీకరించిన చర్యగా కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం, దేశ ఐక్యతను కాపాడేందుకు తీసుకున్న రాజకీయ, నైతిక నిర్ణయంగా తన రాజీనామాను చిత్రీకరించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారత విద్యార్థి ఉద్యమానికి ఒక ము ఖ్యమైన రాజకీయ విజయం. అయితే ఆయన రాజీనామా లేఖలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తున్నది. పరిపాలనా వైఫల్యాన్ని అంగీకరించిన చర్యగా కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం, దేశ ఐక్యతను కాపాడేందుకు తీసుకున్న రాజకీయ, నైతిక నిర్ణయంగా తన రాజీనామాను చిత్రీకరించారు. అంటే బాధ్యతను అంగీకరించే బదులు, తాను బాధితుడిననే భావనను ముందుకు తెచ్చారు. ఇపుడు సమస్య ఒక మంత్రి గురించో, ఒక ప్రశ్నాపత్రం లీక్ గురించో కాదు. మన విద్యావ్యవస్థ క్రమంగా కేంద్రీకృతమై, వ్యాపారీకరణ చెంది, విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడిని మోపే విధంగా మారిపోయిందనే విషయాన్ని విద్యార్థి ఉద్యమం ఎత్తిచూపుతున్నది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డిజిటల్ పరీక్షలను మరింత భద్రంగా నిర్వహించడం, ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టడం దీని లక్ష్యం. అయితే, సాంకేతిక భద్రతను మెరుగుపరచడం అవసరమే. కానీ ఇవి పైపై సంస్కరణలు మాత్రమే, సమస్య మూలాలను ఏమాత్రం పరిష్కరించలేవు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కొన్నేండ్లుగా చేస్తున్న వాదనను తెలుసుకోవాలి. నీట్ విధానం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేస్తుందని వాదిస్తున్నది. పన్నెండో తరగతి విద్యను పక్కనబెట్టి, ఒకే పరీక్ష ఆధారంగా వైద్య విద్యలో ప్రవేశాలు ఇవ్వడం విద్యలో సమాన అవకాశాల సూత్రానికి విరుద్ధమని పేర్కొంటున్నది. జస్టిస్ ఏకే రాజన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది.
దేశమంతటా ప్రవేశాలను ఒకే సంస్థ నియంత్రించినపుడు, ఒక చిన్న సాంకేతిక లోపం, ఒక ప్రశ్నాపత్రం లీక్ లేదా ఒక పరిపాలనా పొరపాటు కూడా జాతీయ స్థాయి సంక్షోభంగా మారుతుంది. అధిక కేంద్రీకరణ ప్రమాదాలను తగ్గించలేదు. వాటిని మరింత పెంచుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటైనపుడే ప్రగతిశీల విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే హెచ్చరించాయి. అన్ని పరీక్షలను ఒకే సంస్థ చేతిలో పెట్టడం వల్ల సమాఖ్య వ్యవస్థ బలహీనపడుతుందని, మొత్తం ప్రవేశ ప్రక్రియ వ్యవస్థాగత వైఫల్యాలకు గురవుతుందని వారు స్పష్టం చేశారు. ఇపుడు వారి హెచ్చరికలు నిజమయ్యాయని స్పష్టంగా తెలుస్తున్నది. ఈ సంక్షోభాన్ని జాతీయ విద్యావిధానం 2020 తర్వాత విద్యలో జరిగిన విస్తృత మార్పుల నుంచి వేరుచేసి చూడలేం. ఇటీవల వచ్చిన విశ్లేషణలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. పరీక్షల కేంద్రీకరణ, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి తగ్గించడం వంటి చర్యలు విద్యలో వైవిధ్యం, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ, ప్రామాణీకరణ, అధికార కేంద్రీకరణను పెంచుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ కొత్త టాస్క్ఫోర్స్ లక్ష్యాలు పూర్తిగా విస్మరించిన మరో ముఖ్యమైన అంశం కోచింగ్ పరిశ్రమ. ప్రపంచంలోనే అతిపెద్ద కోచింగ్ మార్కెట్లలో భారత్ ఒకటి. ఇపుడు విజయం కేవలం ప్రతిభపై మాత్రమే ఆధారపడడం లేదు. ఖరీదైన కోచింగ్ను పొందే ఆర్థిక స్థోమతపై కూడా ఆధారపడుతున్నది. అనేక నగరాలు కోచింగ్ కేంద్రాలుగా మారిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం రూపొందించే కొత్త టాస్క్ఫోర్స్పై సందేహాలు కలుగడానికి మరో కారణం కూడా ఉన్నది. 2024లో జరిగిన నీట్ వివాదాల తర్వాత ప్రభుత్వం రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పరీక్షల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలపై అనేక సూచనలు చేసింది. కానీ వాటిలో చాలావరకు అమలు కాలేదు. అందువల్ల సమస్య కమిటీల కొరత కాదు. రాజకీయ సంకల్పం లేకపోవడమే అసలు సమస్య. గత కమిటీ సూచనలను అమలు చేయకుండా మరో కమిటీ వేయడమంటే ప్రజల ఆగ్రహాన్ని తాత్కాలికంగా చల్లార్చే ప్రయత్నంగానే కనిపిస్తున్నది.
భారతదేశానికి డిజిటల్ సంస్కరణలు మాత్రమే సరిపోవు. పరీక్షల కేంద్రీకరణను తగ్గించాలి. రాష్ర్టాలు, విశ్వవిద్యాలయాలకు తగిన పాత్రను తిరిగి ఇవ్వాలి. ఒకే ప్రవేశపరీక్షపై ఆధారపడకుండా, ప్రవేశాలకు అనేక ప్రమాణాలను అమలు చేయాలి. కోచింగ్ పరిశ్రమను నియంత్రించాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. పరీక్షల నిర్వహణలో తప్పులు జరిగితే విద్యార్థులకు న్యాయం జరిగేలా చట్టబద్ధమైన జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సాంకేతికత ఒక పరీక్షను భద్రంగా నిర్వహించగలదు. కానీ న్యాయాన్ని అందించలేదు. ఒక మంత్రి రాజీనామా తక్షణ రాజకీయ ఒత్తిడిని తగ్గించవచ్చు. ఒక కొత్త టాస్క్ఫోర్స్ మరో నివేదిక ఇవ్వవచ్చు. మెరుగైన సైబర్ భద్రత ప్రశ్నాపత్రాల లీకులను కొంతవరకు అడ్డుకోవచ్చు. కానీ విద్యావ్యవస్థలోని అధిక కేంద్రీకరణ, వ్యాపారీకరణ, ప్రభుత్వ విద్య బలహీనపడడం వంటి మూల సమస్యలను పరిష్కరించకపోతే పరీక్షల సంక్షోభాలు మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. అందువల్ల భారతదేశం నిర్మించాల్సింది కేవలం మరింత భద్రమైన పరీక్షా వ్యవస్థ కాదు. మరింత ప్రజాస్వామ్యబద్ధమైన, సమానత్వంతో కూడిన విద్యావ్యవస్థ.
– (వ్యాసకర్త: అధ్యాపకుడు )
ఎడమ శ్రీనివాసరెడ్డి 9949905069
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

