కామారెడ్డి, మే 6 : పెండ్లికి వెళ్తున్న ఓ కారు కల్వర్టును ఢీకొనగా, వరుడి తల్లిదండ్రులతోపాటు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకున్నది. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన చిదుర సిద్ధి రాములు-వినోద దంపతుల కుమారుడు చిదుర భరత్ వివాహం కామారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో ఏర్పాటు చేశారు. పెండ్లి కొడుకు తల్లిదండ్రులతోపాటు మేనత్తలు, ముగ్గురు చిన్నారులు మొత్తం 8మంది ఫంక్షన్హాలుకు కారులో బయల్దేరారు.
మార్గమధ్యంలో కామారెడ్డి మండలం చిన్నామల్లారెడ్డి గ్రామ శివారులో కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా, కారులో ఉన్న పెండ్లి కొడుకు తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. మేనత్త మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఇందులో ఒకరి పరిస్ధితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. కల్వర్టు పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నది. ఒకవేళ కల్వర్టును కాకుండా ట్రాన్సఫార్మర్ను ఢీకొని ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఒక పక్క విషాద ఘటన చోటుచేసుకోగా, మరోవైపు తల్లిదండ్రులు లేకుండానే వివాహం జరిపించారు.