మోదీ సర్కార్ పాలనలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. దేశంలో 84 శాతం మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రతి పది మందిలో 8 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులకు జాబ్స్ లేవని, ఎంబీయే చదివిన వారిలో ప్రతి నలుగురిలో ముగ్గురికి ప్లేస్‌మెంట్స్ లేవని తెలిపింది. దేశంలో నిరుద్యోగ పరిస్థితికి ఇది అద్దం పడుతున్నది.
న్యూఢిల్లీ, మే 6: దేశంలో నిరుద్యోగం అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా అర్హతకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. ఎంబీఏ విద్యార్థుల్లో కేవలం 26 శాతం మంది, ఇంజినీర్లలో కేవలం 15 శాతం మంది, పట్టభద్రుల్లో కేవలం 16 శాతం మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ‘అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026’ వెల్లడించింది. ఈ లెక్కన 70 నుంచి 85 శాతం మంది విద్యార్థులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని పేర్కొన్నది. పట్టభద్రులు కానివారిలో 84శాతం మంది నిరుద్యోగులుగా ఉండగా, 17 శాతం మందికి నియమాలు ఆలస్యం కావడం లేదా చివరి నిమిషంలో రద్దు కావడం జరుగుతున్నదని తెలిపింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 150కిపైగా కంపెనీలు కాలేజీలకు వచ్చినప్పుడు 2.9 రెట్లు అధికంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, 30 కన్నా తక్కువ కంపెనీలు వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక వివరించింది. గత ఏడాదిలోపు పట్టభద్రులైన వారిలో మెజారిటీ విద్యార్థులు ఇంతవరకు ఉపాధిని పొందలేకపోయారని తెలిపింది. కంపెనీలు కొత్తవారిని చేర్చుకుంటున్నప్పటికీ ఆచితూచి ఎంపిక చేస్తున్నాయని తెలిపింది. అవకాశాలు కొన్ని క్యాంపస్‌లలో, నైపుణ్య సమూహాలలో, నియామక పద్ధతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయని వివరించింది.
కార్మికులు, యువతలో నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో కేంద్ర సర్కార్ 2015లో పీఎం కౌశల్ వికాస్ యోజన స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అదే ఏడాది స్కిల్ ఇండియా మిషన్‌ను కూడా ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకాలన్నీ ప్రచారా ఆర్భాటాలకే పరిమితమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, పీఎల్ఎస్ఎఫ్, ఐఎల్వో, అన్‌స్టాప్ సంస్థలు విడుదల చేసిన నివేదికలను పరిశీలిస్తే ఇది నిజమేనని అంటున్నారు. మోదీ సర్కారు ఇప్పటికైనా ఉపాధి కల్పనపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.
దేశంలో చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతం మంది మాత్రమేనని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ సంస్థ ఇటీవలి అధ్యయనంలో వెల్లడించింది. 50 శాతానికిపైగా పట్టభద్రులు క్లర్క్, మెషీన్ ఆపరేటర్ వంటి ఏడో తరగతి స్థాయి ఉద్యోగాలను చేస్తున్నట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో తేలింది. దేశంలో 47 శాతం మందిలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వ ఉక్కు ఉత్పత్తి సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఒప్పంద కార్మికులను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనిని అమలు చేయడం ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 40 శాతం ఒప్పంద కార్మికులను సంస్థ తొలగించనుంది. ఈ వార్త కార్మిక వర్గాల్లో సంచలనం సృష్టించింది. సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తమ జీవితాలు ఏం కావాలని వారు ఆందోళన చెందుతున్నారు. బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్చార్జి ప్రియా రంజన్ పేరిట ఏప్రిల్ 18న సంస్థ పంపిన ఒక అంతర్గత లేఖలో సమీకృత ఉక్కు కర్మాగారాలలోని పనులు, పనేతర విభాగాలలోని ఒప్పంద కార్మికుల హేతుబద్ధీకరణకు సంబంధించిన లక్ష్యాల గురించి 2025లో జారీ చేసిన లేఖల ద్వారా తెలియజేసినట్టు పేర్కొన్నది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 12న రాసిన లేఖలో సెయిల్ ఇప్పటికే నిర్దేశించిన 20 శాతం లక్ష్యంలో 18.8 శాతం కాంట్రాక్టు కార్మికులను తగ్గించినట్టు తెలిపింది. 2026-26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఒప్పంద కార్మికుల హేతుబద్ధీకరణను కొనసాగించాల్సిన అవసరాన్ని తాజా లేఖ స్పష్టం చేసింది. దీని ప్రకారం 2027 మార్చి 31 నాటికి 40 శాతం ఒప్పంద కార్మికులను తగ్గించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది.