హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కొందరు రౌడీలు వీరంగం సృష్టించారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి కర్మన్‌ఘాట్‌లోని అర్బన్ బీట్స్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించిన ఆరుగురు యువకులు.. తాము డీజీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్నామని, రూ.6 వేల బిల్లులో 30% డిస్కౌంట్ ఇవ్వాలని మేనేజర్ నాగేందర్‌ను డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించిన నాగేందర్‌ను యశ్వంత్‌రెడ్డి అనే యువకుడు దుర్భాషలాడుతూ ఆ రెస్టారెంట్ యజమానిని పిలవాలంటూ బెదిరించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వెంటనే యశ్వంత్ తన సోదరుడైన ప్రసన్నరెడ్డికి సమాచారం ఇవ్వడంతో మరో 20 మంది యువకులు వచ్చి హంగామా సృష్టించారు. ఆ రెస్టారెంట్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు రెస్టారెంట్ సిబ్బంది, యజమానులను బూతులు తిడుతూ కత్తులతో దాడికి తెగబడ్డారు. రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లపై కూడా విరుచుకుపడటంతో వారంతా తమ భోజనాలను మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం రెస్టారెంట్ యజమానులిచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపు చేయకుండా అక్కడ జరుగుతున్న తంతును వీడియోలో చిత్రీకరించేందుకు పరిమితమయ్యారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యాక బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. నిందితులు ప్రసన్నరెడ్డి, యశ్వంత్‌రెడ్డి గతంలో వనస్థలిపురంలో జరిగిన హత్య కేసులో జైలుకు వెళ్లారని, అక్కడ పరిచయమైన కొందరు ఇతర నేరస్థులతో కలిసి ప్రస్తుతం ఓ గ్యాంగ్‌ను మెయింటైన్ చేస్తున్నారని, ప్రముఖులతో దిగిన ఫోటోలను చూపిస్తూ ఏకంగా పోలీసులనే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగారని బాధితులు ఆరోపిస్తూ ఏసీపీ, డీసీపీని కలిశారు. అయినా స్థానిక పోలీసులు స్పందించలేదు. దీంతో తమపై జరిగిన దాడిని బుధవారం మీడియా దృష్టికి తీసుకురావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సరూర్‌నగర్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా, ఈ ఘటనపై ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సరూర్‌నగర్ సీఐ శ్రీశైలం తెలిపారు.