హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత (40.1 డిగ్రీలు) నమోదైంది. రానున్న నాలుగు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది.
బుధవారం నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు. గురువారం మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొంది.