న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పిట్ట కొంచెం.. కాపలా ఘనం.. అని గుజరాత్లోని అటవీ శాఖాధికారులు చేస్తున్న హంగామాను చూసి ఎవరైనా కామెంట్ చేయడం ఖాయం.. ఇక అసలు విషయానికొస్తే.. బట్టమేక పిట్ట అనేది అరుదైన పక్షి. దీని సంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతుంది. దీనినే గోదావన్గా కూడా వ్యవహరిస్తుంటారు. గుజరాత్లో పదేండ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 26న ఈ పక్షి పిల్ల జన్మించింది. అంతరించిపోయే జాతిలో ఉన్న దీనిని రక్షించడం అటవీ శాఖకు పెద్ద పరీక్షగా మారింది. దీంతో ఆ శాఖ దీని రక్షణ కోసం 50 మంది గార్డులను ఏర్పాటు చేసింది. దాంతో వారు మూడు షిఫ్టుల్లో దానిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. బైనాక్యులర్స్, స్కోప్లతో పాటు హైటెక్ సర్వేలెన్స్లను ఉపయోగించి కాపలా కాస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని మనుషుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు. ఇదంతా చేసి సరిహద్దుల వద్ద కూడా సైనికులు ఇంత హంగామా చేయరు కదా అని పలువురు కామెంట్లు విసురుతున్నారు.