గడిచిన ఏడేండ్లలో తెలంగాణ మనుగడ,అభివృద్ధి వికాసాల గురించి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రూపురేఖలే మారిపోయాయి. కొవిడ్ కారణంగా ఆర్థికరంగం కుదేలైన నేపథ్యంలో స్థిరాస్తి రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. కానీ తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందనే అపోహలుండేవి. కానీ ముందెన్నడూ లేని స్థాయిలో పుంజుకున్నది. రియల్ ఎస్టేట్ రంగం ప్రధానంగా నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. సుస్థిరమైన ప్రభుత్వం, సంస్కరణలు, ప్రజల జీవన ప్రమాణాలు, శాంతిభద్రతలు.
సుస్థిర ప్రభుత్వం ఉంటే నిర్ణయాలు సజావుగా, సకాలంలో తీసుకోగలుగుతారు. కొన్నేండ్ల పాటు నిర్ణయాలు మారవనే భరోసా ఉంటుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడేండ్లుగా సుస్థిరంగా కొనసాగుతున్నది. అన్నీ ప్రజానుకూల నిర్ణయాలే తీసుకుంటున్నది. శాంతిభద్రతల్లో కూడా తెలంగాణ పోలీసింగ్ టాప్‌లో నిలిచింది. దీంతో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల్లో, వ్యాపారవర్గాల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చింది.
ఒక రాష్ర్టాన్ని సంస్కరణలు ముందుకు తీసుకువెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అనూహ్య సంస్కరణలు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఐటీ, పారిశ్రామిక, వ్యవసాయరంగంలోని పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. దీంతో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. కంపెనీలు తరలివచ్చే చోట రియల్ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగయ్యాయి. సాగునీటి ప్రాజెక్టులు కట్టి పొలాలకు నీళ్లివ్వడం, రాష్ర్టానికి అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రావడం, ఉపాధి పెరగడం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరగడం.. ఇలా ఎన్నో పరిణామాలు ప్రజల ఆదాయాన్ని పెంచాయి. దీంతో ప్రజలు తమ ఆదాయాన్ని భూమిపై పెట్టుబడిగా పెట్టడం మొదలైంది.
తెలంగాణలో స్థిరాస్తిరంగం అనూహ్య వృద్ధి సాధించడానికి మరో ముఖ్య కారణం కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు. చాలామందికి జిల్లా లేదా మండల కేంద్రం అంటే ఒక పాలనా కేంద్రమే. కానీ, ఇంకో కోణం నుంచి చూస్తే అదో వ్యాపార కేంద్రం. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కంపెనీలు వస్తాయి. ఉపాధి పెరుగుతుంది. పెద్దపెద్ద భవనాలతో నగర వాతావరణం ఏర్పడుతుంది. దీంతో కొత్త భవనాలు, స్కూళ్లు, దవాఖానలు.. ఇలా ఎన్నో వసతులు సమకూరుతాయి. జిల్లాలుగా 10 ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ 33 ప్రాంతాలకు విస్తరింపజేశారు. ఇలా సగటున రాష్ట్రంలో ప్రతి 15-20 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షణ కేంద్రం తయారైంది. ఒక్కో కేంద్రం చుట్టూ కిలోమీటర్ల మేర భూముల ధరలు పెరిగాయి.
‘రియల్ బూమ్’తో శివార్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గతంతో పోల్చితే కొన్ని కిలోమీటర్ల మేర పట్టణాల విస్తీర్ణం పెరిగింది. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) హద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి పదుల కిలోమీటర్ల దూరం విస్తరించింది. దీనికి కారణం.. భూమిపై పెట్టుబడితో అతి తక్కువకాలంలోనే ఎక్కువ లాభాలు వస్తుండటం.
ఇటీవలి కాలంలో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే గేటెడ్ ప్లాటింగ్. అంటే.. ఒక గేటెడ్ వెంచర్లో ఉండే ప్రహరీ, విద్యుత్, రోడ్డు, డ్రైనేజీ, క్లబ్‌హౌజ్, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, పార్క్ ఇలా అన్నిరకాల సౌకర్యాలుంటాయి. దీంతో చాలా మంది వీటివైపు ఆసక్తిగా చూస్తున్నారు. భవిష్యత్తును ఊహించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన నిర్ణయాల ఫలితాలు మరో దశాబ్దం వరకు వస్తూనే ఉంటాయి. దీనికితోడు భౌగోళిక వాతావరణం మనకు పెద్ద వనరు. కాబట్టి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం శోభిల్లుతున్నది. మున్ముందు కూడా ఇలాగే ఉంటుందనటంలో సందేహం లేదు.
–సుస్కండ్ల అనిల్ రెడ్డి
(వ్యాసకర్త: జేబీ ఇఫ్తా డైరెక్టర్ (మార్కెటింగ్)