నస్రుల్లాబాద్, నవంబర్ 6 : ఐదురోజులుగా రైతుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు అన్లోడ్ చేసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు ధాన్యం లారీ ఎక్కి నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన తొమ్మిది మంది రైతులకు సంబంధించిన 666 బస్తాల (266 క్వింటాళ్లు) ధాన్యాన్ని నస్రుల్లాబాద్ సొసైటీ నుంచి బీర్కూర్ మండలంలోని ఓ రైస్‌మిల్లుకు ఈ నెల 2వ తేదీన కేటాయించారు.
రైస్‌మిల్లు యాజమాన్యం ధాన్యాన్ని దించుకునేందుకు నిరాకరించడంతో అధికారులు 3వ తేదీన బీర్కూర్‌లోని మరో రైస్‌మిల్లుకు సిఫార్సు చేశారు. 6వ తేదీ వరకు రైస్‌మిల్లర్ ధాన్యాన్ని దించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు.. రైస్‌మిల్లు వద్ద ధాన్యం లారీ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో చివరికి రైస్‌మిల్ యాజమాన్యం ధాన్యాన్ని దించుకున్నది.