హనుమకొండ చౌరస్తా, నవంబర్ 6 : విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది. విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు పోరుబాట పట్టాయి. కాలేజీలను నిరవధికంగా బంద్ చేశాయి. దీంతో తరగతులు జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఏ, బీఈడీ తదితర మొత్తం 397 కాలేజీలున్నాయి.
2022-23 విద్యా సంవత్సరానికి రూ.170 కోట్లు, 2023-24లో రూ.170 కోట్లు, 2024-25లో బకాయిలు రూ.170 కోట్లతో పాటు 2025-26కు సం బంధించిన పూర్తి బకాయిలు విడుదల కావా ల్సి ఉంది. బకాయిల కోసం సెప్టెంబర్‌లో కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడం తో యాజమాన్యాలతో చర్చలు జరిపిన ప్ర భుత్వం రెండు దఫాల్లో రూ.1200 కోట్ల బ కాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు 50 రోజులు ఎదురుచూశాయి. అయినా నిధులు విడుదల చేయకపోవడంతో సోమవారం నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తున్నాయి.
అలాగే కాకతీ య యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ని కళాశాలల యాజమాన్యాలు సైతం సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. కేయూ డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, బాధ్యులు వేణుమాధవ్, రవీందర్‌రెడ్డి, హరీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీ అధికారులు ఈనెల 1న సమ్మెనోటీస్ అందజేశారు. ఫీజు బకాయిలు విడుదల చేసే వరకు కాలేజీలను మూసివేస్తామని, పరీక్షలు కూడా నిర్వహించమని స్పష్టం చేశా రు. పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌కు సైతం అసోసియేషన్ బాధ్యులు కాలేజీలను నడపలేకపోతున్నామని తెలిపారు.
కాగా కేయూ పరిధిలో 240 వరకు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల్లో 2 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. మూడు ఇంజినీరింగ్, 24 ఫార్మసీ, 42 విద్యా కా లేజీలు, రెండు లా కాలేజీలున్నాయి. వీటికి రూ.100 కోట్ల కు పైగానే బకాయిలు రావాల్సి ఉందని యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ రాకపోవడంతో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులకు ఆటంకం కలిగే అవకాశమున్నది. మరోవైపు ఆయా సెమిస్టర్ల సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలుస్తున్నది. పరీక్షల నిర్వహణపై కూడా అయోమయం నెలకొన్నది.
కలెక్టరేట్ ఎదుట ప్రైవేట్ కళాశాలల ధర్నా
హనుమకొండ, నవంబర్ 6 : ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోతే చదువు లు కొనసాగించలేమని, ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు ధర్నా చేశాయి. డిగ్రీ అండ్ పీజీ కాలేజీల వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ సుందర్‌రాజ్‌యాదవ్ మాట్లాడుతూ ప్ర భుత్వం మంజూరు చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలో ఉచితం గా విద్యా బోధన చేస్తున్నాయన్నారు. అందుకయ్యే ఖర్చులను ఆయా యాజమాన్యాలు భరిస్తూ కళాశాలలను నెట్టుకుంటూ వస్తున్నాయని పేర్కొన్నారు.
బకాయిలు పేరుకుపోవడంతో ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలోకి యాజమాన్యాలు నెట్టివేయబడ్డాయని, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలోకి తమను ప్రభుత్వం దిగజారుస్తోందని ఆవేదన వ్య క్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిషరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ స్నేహా శబరీష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేయూ కాలేజీల అసోసియేషన్ ట్రెజరర్ వేణుమాధవ్, సంజీవ్‌రెడ్డి, నారాయణ రెడ్డి, కృష్ణమోహన్, హరేందర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ ఇల్లు ముట్టడి
నయీంనగర్, నవంబర్ 6 : సర్కారు ఫీజు బకాయిలు చెల్లించక విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నదని గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకోగా స్ప ల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మా ట్లాడుతూ ఫీజు బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయడం సరైంది కాదన్నారు. నాలుగేళ్లుగా సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పంద న లేదని మండిపడ్డాడు.
ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా కనీసం విద్యార్థుల సమస్యలు తీర్చే ఆలోచన చేసే పరిస్థితి లేదన్నారు. తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థి నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఒటూరి ప్రణీత్, కార్యదర్శి సంతోష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి, కుమార్, భానుప్రసాద్, జ్యోతి, వినయ్, చరణ్, రాజు, రమే శ్, రమ్య, సృజన, సౌమ్య పాల్గొన్నారు.
వీసీతో చర్చించి పరీక్షల షెడ్యూల్..
ఫీజు బకాయిల కారణంగా ఇప్పటికే కాలేజీలు బం ద్ పాటిస్తున్నాయి. పరీక్ష ఫీజు కూడా 3వ తేదీతో ముగిసింది. ఈ నెల 15 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. ప్రైవేటు కాలేజీల బంద్ విరమించుకున్న తర్వాత వీసీతో చర్చించి పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణయిస్తాం. లక్ష మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ కాలేజీలు తక్కువగా ఉన్నాయి.
– కట్ల రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారి, కేయూ