Nizamabad | కంటేశ్వర్, నవంబర్ 6 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నగరంలోని 60 డివిజన్లో రోడ్లు గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్ మున్నూరు కాపు సంఘం ఎదురుగా రోడ్డు మధ్యలో కుంగిపోయి ప్రమాదకరంగా తయారైంది. అధికారులు రోడ్డు కుంగిన ప్రాంతంలో చెట్ల కొమ్మలు పెట్టి చేతులు దులుపుకున్నారు.
పట్టణ నడిబొడ్డున ఉన్న రోడ్డు మధ్యలో రోడ్డు కుంగిపోవడం, అధికారులు దాన్ని సరి చేయకుండా కేవలం చెట్ల కొమ్మలు పెట్టి చేతులు దులుపుకోవడంతో ఆ ప్రాంతంలో తిరిగే వాహనదారులు, ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నగర సుందరీకరణ పట్టణ అభివృద్ధి అని చెప్పుకుంటే తిరిగి అధికారులకు కుంగిన రోడ్డు కనిపించట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.