పాలకుడికి తన ప్రాంతం పట్ల ప్రేమ ఉండాలి. పాలనలో దీక్షాదక్షత ఉండాలి. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమంపై ధ్యాస ఉండాలి. అంతేకానీ, ఎప్పుడూ ప్రతీకారంతో రగిలిపోతే దాని ప్రభావం పాలనపై పడుతుంది. ప్రతిపక్షాల పట్ల ప్రతీకారంతో వ్యవహరించడం వల్ల అంతిమంగా పాలన గాడి తప్పి ప్రజలే సమిధలు కావాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రగతిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపే ప్రధాన లక్ష్యంగా పాలన సాగిస్తే రామరాజ్యం కాస్త రావణకాష్ఠంలా మారుతుంది. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న విధ్వంసక పాలనే అందుకు తార్కాణం.
రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారంతో పాలనను పక్కకుపెట్టి విధ్వంసం సృష్టించే ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించవు. ప్రపంచ చరిత్రను ఒకసారి పరికించి చూస్తే విధ్వంసం దిశగా వెళ్లి పతనమైన అనేక ప్రభుత్వాలు మనకు కనిపిస్తాయి.
గాలివాటంగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ప్రతిపక్షాలపై కసి తీర్చుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తున్నది. మసిబూసి మారేడుకాయ చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఎప్పుడో పాలనను గాలికి వదిలేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే 347 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 119 మంది నేత కార్మికులు తనువు చాలించారు. సుమారు 100 మంది నిరుద్యోగులు అసువులు బాశారు. 49 మంది విద్యార్థులు మరణించారు. అంతేకాదు, 217 మంది అమాయకులు కరెంటు షాక్ కారణంగా చనిపోయారు. తెలంగాణలో చావు వార్త లేకుండా తెల్లారిన రోజు లేదని చెప్పడం అతిశయోక్తి కాదు.
కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన వారోత్సవాలను నిర్వహిస్తుండటం విడ్డూరం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కొనసాగించడం ఆనవాయితీ. అంతేకాదు, ఎన్నికలకు ముందు ప్రకటించిన వాగ్దానాలను అమలు చేయడం వారి బాధ్యత. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తులను చెరిపేయడమే లక్ష్యంగా, గత పాలకులపై కేసులు బనాయించి, వారిని జైల్లో వేయడమే తమ కర్తవ్యమన్నట్టుగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది. కాంగ్రెస్ పాలకుల తీరు అచ్చం వికృత రాజకీయాన్ని తలపిస్తున్నది.
39 స్థానాలను కట్టబెట్టి, ప్రధాన ప్రతిపక్షంగా అవకాశమిచ్చిన ప్రజల పక్షాన పోరాడటం, ప్రజల హక్కులను కాపాడటం ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ బాధ్యత. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పార్టీని గౌరవించి ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనలను గత కేసీఆర్ సర్కార్ స్వీకరించింది. కానీ, నేడు ప్రశ్నిస్తే కేసులు, హామీలపై నిలదీస్తే అరెస్టులు, పాలనలో లోపాలను గుర్తుచేస్తే జైళ్లల్లో వేయడం వంటి చర్యలతో రేవంత్ సర్కార్ పాలన ఒక ప్రహసనంలా మారింది. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తున్న బృందాలపై కేసులు బనాయిస్తున్నారంటేనే ప్రతిపక్ష బీఆర్ఎస్పై ప్రభుత్వానికి ఎంతటి ప్రతీకారేచ్ఛ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై నిలదీసినందుకు లగచర్లల్లో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టారు. హైడ్రా, మూసీ పేరిట నగరంలో పేదల ఇండ్లను కూలుస్తున్న ప్రభుత్వానికి అడ్డొచ్చినవారిని కటకటాల పాలుచేస్తున్నారు. అయితే పార్టీలపై, నేతలపై ప్రతీకారం, కసి, కోపం ఉంటే ఉండొచ్చు గాక.. కానీ, ప్రజలను సైతం కేసుల పాలుచేయడం చరిత్రలో ఏ సర్కారు చేయలేదు. ప్రజాపాలనలో వేలాది మంది అమాయక ప్రజలు జైళ్లల్లో మగ్గుతున్నారు.
లగచర్ల రైతులు జైలు పాలుకాగా, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రజలపై కేసులు పెట్టారు. తాము గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు అడిగినందుకు గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులపై కూడా కేసులు బనాయించారు. ఉద్యోగాలు కల్పించాలని నిలదీస్తే విద్యార్థులపై లాఠీలు ఝళిపించారు. ఏడాదిలోనే ఇందిరమ్మ రాజ్యం (ఎమర్జెన్సీ రాజ్యం) దిశ గా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నది. కేసీఆర్ సర్కార్ పదేండ్ల పాటు పచ్చని పాలన అందించగా.. ఒక్క ఏడాదిలోనే నెత్తుటి పాలన అందిస్తున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ అపకీర్తిని మూటగట్టుకున్నది.
సేవ్ డెమోక్రసీ అంటూ రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా తిరుగాడుతుంటే.. రాష్ట్రంలో రేవంత్ మాత్రం డెమోక్రసీ గొంతు నులుముతున్నారు. నేడు రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తున్నది. అరెస్టులు, నిర్బంధాలతో కూడిన నిరంకుశ పాలన కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే, సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడి 49 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ర్టానికి హోం మంత్రిని నియమించలేదు. గత అసెంబ్లీ సెషన్ సమయంలో నగరం నడిబొడ్డున ఓ ఆడబిడ్డపై లైంగికదాడి జరిగింది. విద్యార్థుల అక్రమ అరెస్టులు జరిగాయి. అంతేకాదు, ఎన్నడూ లేని విధంగా జంటనగరాల్లో రెండు నెలలుగా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.
పచ్చని తెలంగాణ నేడు ఎన్కౌంటర్ల తెలంగాణగా మారిపోయింది. మొన్నటివరకు ఎన్కౌంటర్లు లేని తెలంగాణను చూసిన మనం ఇవాళ ఎప్పుడు, ఎక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన ఏడాదిలోనే మూడు ఎన్కౌంటర్లు, ఆరు కేసులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
ప్రభుత్వం కొలువుదీరిన నాటినుంచీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టాలనే ఆలోచన తప్ప, మంచి ప్రజాస్వామిక పాలన అందించాలని ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నించలేదు. అందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ అని, కరెంటు కమిషన్ అని కేసీఆర్‌పై, ఈ-రేస్ అని కేటీఆర్‌పై, నేడు ఫోన్ ట్యాపింగ్ అని హరీశ్‌రావుపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. సహచర ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కలవడానికి వెళ్తే అక్రమంగా అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో హరీశ్‌రావును నిర్బంధించడం మరీ దారుణం.
కేసీఆర్, ఆయన కుటుంబంపై ప్రతీకారంతో నియమించిన కాళేశ్వరం కమిషన్ విచారణ కక్ష సాధింపులో భాగంగానే సాగుతున్నది. కరెంటు కమిషన్ విచారణ కేసీఆర్ కేంద్రంగానే సాగి అభాసుపాలైంది. కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను కేంద్రంగా చేసుకొని డైలీ సీరియల్లా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అతీగతీ లేదు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రజా సమస్య ఉత్పన్నమైనప్పుడల్లా ఏదో ఒక కేసు, విచారణ పేరుతో గత ప్రభుత్వం తాలూకు ఆనవాళ్లను నెమరువేసుకుని దృష్టి మళ్లిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలపై విచారణ పేరిట కేసులు బనాయించడం, వారిని జైల్లో వేయాలనే లక్ష్యంగా సాగుతున్న ఈ పాలన తాత్కాలికమే అన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి.
బుద్ధిజీవులు, మేధావులు మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైంది. నిర్బంధాన్ని, రాజ్య హింసను ఎదుర్కోవడం తెలంగాణ సమాజానికి కొత్త కాదు. నిర్బంధాల నుంచే స్వరాష్ట్రంగా తెలంగాణ ఉదయించింది. అలాగే కాంగ్రెస్ సర్కార్ నేడు చేస్తున్న నిర్బంధకాండ నుంచే బీఆర్ఎస్ సర్కార్ మళ్లీ జీవం పోసుకోవడం ఖాయం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
-గోసుల శ్రీనివాస్ యాదవ్