కల్లబొల్లి కబుర్లతో అధికారంలోకి వచ్చినవారు నిఖార్సయిన పాలన ఎలా అందించగలరు? మాయమాటలతో ఓటును కాజేసినవారు హామీలను ఎలా నిలబెట్టుకోగలరు? ‘హస్తవ్యస్త’ పాలనలో రాష్ట్రం ఓ ‘బొంకుల’ దిబ్బగా మారింది. ఏదో పొడిచేస్తామని గద్దెనెక్కినవారు ఇరికి ఇగిలిస్తున్నారు. నీలంరంగు గుంటనక్క నీళ్లల్లో తడిసి అసలు రంగు బయటపడిన తర్వాత ఆకలి కోసం మోసం చేశానంటుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారు. చెరువులో బియ్యం పోసి చెరువు కింద మంటపెట్టి ఊరందరికీ కుడుపు పెడతా అని ఏతులు చెప్పే తుపాకీ రాము డు అవన్నీ చెయ్యడని ప్రజలకు తెలుసు. అది వినోదం. ఇక్కడ హామీలు, గ్యారంటీలంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ను తప్పడం విషాదం.
‘అధికారం కోసం ఏవేవో ఇస్తామని చెప్పాం.. అవన్నీ ఎక్కడ నుంచి తెమ్మంటారని’ గడుసుగా ఎదురుప్రశ్న వేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ను తిడుతూ కాలక్షేపం చేయడం ఇంక వీలుకాని పరిస్థితి వచ్చింది. ‘వారు అప్పు చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పా?’ అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటిదాకా లక్షన్నర కోట్లకు పైగా అప్పు తెచ్చారు. మరో లక్షన్నర కోట్లకు చీటీ రాసి పంపుతున్నారు. కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట దేవుడెరుగు.. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులను ఉపయోగించుకోవడమూ చేతకాక రాష్ర్టాన్ని ఎండబెడుతున్నారు. కొన్నిప్రాజెక్టుల్లో అయితే నిర్వహణకు అవసరమైన అయిదారు కోట్లు చెల్లించలేక ఎత్తిపోతల మూలకు పడుతున్నది. మరి అన్నేసి కోట్ల అప్పులు తెచ్చి ఏ అడుగులేని బాయిలో పోస్తున్నారో తెలియడం లేదు. ‘జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు డీఏలు అడగకండి’ అని ఉద్యోగుల దగ్గర బీద అరుపులు వినిపిస్తున్నారు ముఖ్యమంత్రి. ఏడాదిలోనే ఇంతగా భ్రష్టుపట్టిపోయిన రాష్ర్టాధినేత మరొకరు ఉండరేమో. ఇదేమని అడిగితే బుకాయింపులతో కొంతకాలం, దబాయింపులతో మరికొంత కాలం నెట్టుకువస్తున్నారు. అక్కసు, ఉచ్చిలి కలగలిసిన ధోరణిలో స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్పై ఆయన పేలిన అవాకులు చవాకులైతే పరాకాష్ఠ. ఆ పదవికే అప్రదిష్ట. పాలనలో లోపాలను ఎత్తి చూపుతున్న జర్నలిస్టుల మీదా బజారు భాషే.
‘బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో’ అన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డికి అపసవ్యపు మాటలు మాట్లాడటమంటే చాలా సరదా. క్షుద్ర పదవిన్యాసంలో సంస్కారం సన్యాసం పుచ్చుకుంది. అన్ని హద్దులూ చెరిగిపోయాయి. అన్ని మర్యాదలూ గాలికెగిరిపోయాయి. పెద్దాచిన్నా తేడా లేకుండా గాయిది మాట్లాడటం సంస్కారం కాదని ఆయనకు ఎవరు చెప్పాలి? ఈయనకు పరిపాలన చేతకాదని ఎవరూ విప్పిచెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు అది స్వానుభవమైపోయింది. మోసపోయి గోసపడుతున్నామని, పాడియావును అమ్మి దున్నపోతును తెచ్చుకున్నామని వారికి ఎప్పుడో తెలిసిపోయింది. ‘సీఎం రేవంత్ స్టేచర్’ ఏమిటో వారే చెప్తారు. ఆయన సర్కారును మార్చురీకి ఎప్పుడు పంపాలో వారే నిర్ణయిస్తారు. అందుకు సరైన అదును కోసం ఎదురు చూస్తున్నారు.