Harish Rao | రేవంత్ రెడ్డి పాలన అంతా దుబారా అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డిది, ఆయన మనవడిది సోకు తీర్చుకోవడానికి మొన్న రూ.100 కోట్లు పెట్టి ఫుట్‌బాల్ ఆడాడాని మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇవాళ సన్మాన కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ సొమ్ము రూ.5 కోట్లతో స్టేడియం కట్టుకున్నాడని విమర్శించారు.
సింగరేణికి చెందిన రూ.100 కోట్ల సీఎస్ఆర్ నిధులను సీఎం రేవంత్ రెడ్డి దుబారా చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. నీ సొంత డబ్బులతో ఫుట్‌బాల్ ఆడుకో.. అంతేకానీ ప్రభుత్వ సొమ్ముతో ఎలా ఫుట్‌బాల్ ఆడుతావని రేవంత్ రెడ్డిని నిలదీశారు. సింగరేణి సీఎస్ఆర్తో కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలు కడితే.. రేవంత్ రెడ్డి ఆయన సోకులు తీర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లతో ఏమైనా వచ్చిందా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
ప్రతిక్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలని కేసీఆర్ ఆలోచించేవారని హరీశ్‌రావు తెలిపారు. ప్రాజెక్టులు కట్టాలి.. ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ పనిచేశారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. మహాలక్ష్మీ పేరుతో మహిళలను మోసం చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు.. ఫ్లైయింగ్ సీఎం అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రెండేళ్లలో 61 సార్లు ఢిల్లీకి వెళ్లాడని అన్నారు.