IMDb Most Popular Movies ప్రముఖ మూవీ డేటాబేస్ సంస్థ ఐఎండీబీ (IMDb) 2025 సంవత్సరానికి గానూ భారతీయ చిత్ర పరిశ్రమలో ‘అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన చిత్రాలతో పాటు, విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సినిమాలు ఈ జాబితాలో నిలిచాయి. ఈ జాబితా కేవలం వసూళ్లపైనే కాకుండా, ఐఎండీబీ వెబ్సైట్లో నెలకు 250 మిలియన్లకు పైగా వచ్చే విజిటర్ల సెర్చ్, ఆసక్తి ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొదటి స్థానంలో హిందీ చిత్రం సైయారా నిలువగా.. దక్షిణాది నుంచి రజనీకాంత్ కూలీ 5వ స్థానంలో, లోక చాఫ్టర్ 1 చంద్ర 10వ స్థానంలో నిలిచాయి. తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా ఇందులో చోటు నిలవకపోవడం గమనార్హం.
1. సైయారా (Saiyaara) – హిందీ
ఈ ఏడాది బాలీవుడ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 10 ఉత్తమ చిత్రాలలో 6 సినిమాలు హిందీవే కావడం విశేషం. ఈ జాబితాలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘సైయారా’ మొదటి స్థానంలో నిలిచింది. అహన్ పాండే, అనీత్ పడ్డా నటించిన ఈ మ్యూజికల్ హిట్ సుమారు రూ. 550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇందులోని పాటలు గ్లోబల్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా వచ్చి, యువతను విపరీతంగా ఆకట్టుకుంది.
2. మహావతార్ నరసింహ – హిందీ (యానిమేషన్)
భారతీయ యానిమేషన్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రమిది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, విజువల్స్ మరియు గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ ప్రమాణాలను అందుకుంది. భక్తి మరియు యాక్షన్‌ను మేళవించి తీసిన ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్లో చేరి, ఐఎండీబీ చరిత్రలో టాప్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ యానిమేషన్ మూవీగా నిలిచింది.
3. చావా (Chhaava) – హిందీ
మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ భారీ చారిత్రక చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. విక్కీ కౌశల్ నటన కెరీర్ బెస్ట్ అనిపించుకోగా, లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్, యుద్ధ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
4. కాంతార: చాప్టర్ 1 – కన్నడ
రిషబ్ శెట్టి మరోసారి తన అద్భుత సృష్టితో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కాంతారకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రావడంతో జనాలు థియేటర్లకి క్యూ కట్టారు. దీంతో సుమారు రూ. 852 కోట్ల వసూళ్లతో 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది.
5. కూలీ (Coolie) – తమిళం
సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అంచనాలకు తగ్గట్టుగా నిలిచింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీ స్టైల్, లోకేష్ మార్క్ టేకింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి.
6. డ్రాగన్ (Dragon) – తమిళం
యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను హిట్ ట్రాక్ ఎక్కించారు. నేటి తరం యువత ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందింది.
7. సితారే జమీన్ పర్ – హిందీ
మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ చాలా కాలం తర్వాత ఒక హృదయాన్ని హత్తుకునే సందేశంతో వచ్చారు. ‘తారే జమీన్ పర్’ లాంటి ఎమోషనల్ బాండింగ్‌తో పాటు, ఈ సినిమాలో వినోదాన్ని కూడా సమానంగా మేళవించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో ఇది ఎడో స్థానంలో నిలిచింది.
8. దేవా (Deva) – హిందీ
షాహిద్ కపూర్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రం ఐఎండీబీ లిస్ట్‌లో 8వ స్థానం దక్కించుకుంది.
9. రైడ్ 2 (Raid 2) – హిందీ
ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అమే పట్నాయక్‌గా అజయ్ దేవగన్ మరోసారి తన గంభీరమైన నటనను ప్రదర్శించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం కంటే కూడా ఎక్కువ ఉత్కంఠను రేకెత్తించింది.
10. లోకా చాప్టర్ 1: చంద్ర – మలయాళం
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా, మలయాళ చిత్రాల మేకింగ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం కేవళం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.