Shubman Gill | భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు టీ20 ప్రపంచకప్ కప్‌లో చోటు కోల్పోయాడు. టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న గిల్‌కు ఐసీసీ ఈవెంట్లో చోటు దక్కకపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. వాస్తవానికి ఇటీవల గిల్ టీ20ల్లో పేలమైన ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. గాయం కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌కు సైతం దూరమైన విషయం తెలిసిందే. గిల్ స్థానంలో బ్యాట్స్‌మెన్-వికెట్ కీపర్ సంజూ శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించి.. జట్టుకు శుభారంభం అందించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్‌గా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు వరకు టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగగా.. గిల్ స్థానంలో వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అక్షర్ పటేల్‌కు బీసీసీఐ అప్పగించింది. అదే సమయంలో జాతీయ జట్టుకు దూరమైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌తో పాటు రింకు సింగ్ జట్టులోకి తిరిగి వచ్చారు. ఇషాన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాపై భారత్ తరఫున ఆడాడు. అదే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా. మరోవైపు, రింకు ఆసియా కప్‌లో భాగంగా ఉన్నాడు, కానీ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లలో చోటు దక్కని విషయం తెలిసిందే.
అయితే, ప్రపంచకప్‌కు గిల్‌ను ఎంపిక చేయకపోవడంతో సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ స్పందించారు. జట్టు కూర్పులో భాగంగా గిల్‌ను తప్పించాల్సి వచ్చిందన్నారు. టీమ్ మేనేజ్మెంట్ టాప్ ఆర్డర్లో వికెట్ కీపర్‌ను ఆడించాలని భావించిందని, అందుకే శుభ్‌మన్ గిల్‌ను తప్పించి సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాంసన్‌కు బ్యాకప్‌గా మరో వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను జట్టులో చేర్చినట్లు పేర్కొన్నారు.