ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మతానికి చెందిన 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్‌ను కొట్టి చంపిన(Lynching) ఘటన తెలిసిందే. ఆ కేసులో బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం ఏడు మందిని అరెస్టు చేసింది. మిమెన్‌సింగ్ సిటీలో దీపూ దాస్‌ను కొట్టి , ఒంటికి నిప్పు పెట్టి చంపారు. దీపూ చంద్రదాస్ దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సిటీలో అతను ఫ్యాక్టరీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. పయనీర్ నిట్ కంపోజిట్ ఫ్యాక్టరీలో అతను కార్మికుడిగా ఉన్నాడు. ఫ్యాక్టరీ లోనే దాస్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరిగిందని, దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొన్నదని, తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ గుంపు అతనిపై దాడి చేశారని, తీవ్రంగా కొట్టారని, ఆ దాడి వల్ల అతను ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెప్పారు. కొట్టి చంపిన తర్వాత ఢాకా-మిమెన్‌సింగ్ హైవే సమీపంలో అతని మృతదేహాన్ని పడేసి దానికి నిప్పు పెట్టినట్లు ఇన్స్పెక్టర్ అబ్దుల్ మాలేక్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తమకు తన కుమారుడి చావు గురించి తెలిసిందని దీపూ తండ్రి రవిలాల్ దాస్ పేర్కొన్నారు.