హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ) : ఓవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Modi) కాంగ్రెస్ అధిష్ఠానం (Congress) యుద్ధం చేస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాత్రం బడే భాయ్ అంటూ మోదీతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మోదీతో తన బంధాన్ని కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బయటపెట్టారు. మోదీ తనకు కచ్చితంగా బడే భాయేనని, ఆయనను అలాగే పిలుస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సీఎం మోదీని బడే భాయ్ అనడాన్ని సమర్థించుకున్నారు. అలా పిలవడం వల్లనే పనులు అవుతున్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారనే విమర్శలకు ఆయన వ్యాఖ్యలతో మరింత బలం చేకూరింది. రేవంత్‌రెడ్డి ఏనాటికైనా బీజేపీ గూడు పక్షేనని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూనే ఉన్నది. మోదీతో దగ్గరయ్యేందుకు పని చేస్తున్నారని ఆరోపించింది. బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా లభించని మోదీ, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ నిమిషాల్లో సీఎం రేవంత్‌రెడ్డికి లభిస్తున్నదని, ఇందుకు కారణం వారంతా ఒకటేనని ఆరోపిస్తున్నది. పరిపాలన ముసుగులో రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని కలిసి రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో కావాల్సిన పనులపై సీఎం రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు. పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే అది తన ఖాతాలో వేసుకుంటున్న రేవంత్‌రెడ్డి, ఒకవేళ అనుమతులు నిరాకరిస్తే మాత్రం ఆ నిందను ప్రతిపక్షాలకు అంటగడుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. శామీర్‌పేట్, మేడ్చెల్ కారిడార్ కోసం రక్షణ శాఖ భూములిస్తే అది తన ఘనతేనని చెప్పుకొన్న సీఎం, మరుక్షణంలోనే మెట్రో రైల్ పొడిగింపునకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ కారణమంటూ ఆరోపించారు.