కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 7: కరీంనగర్లో గవర్నర్ పర్యటన నేపథ్యంలో బీసీ జేఏసీ నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలనే డిమాండ్‌తో గవర్నర్ ఎదుట శాంతియుత నిరసన తెలపాలని వారు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజాము నుంచే బీసీ నాయకుల ఇండ్లకు వెళ్లి ముందస్తుగా అదుపులోకి తీసుకొని, పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉంచారు. గవర్నర్ కార్యక్రమాలు సాయంత్రం ముగిశాక వారిని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఇదేం ప్రజా పాలన? శాంతియుతంగా నిరసన తెలిపే హక్కులేదా? అని ప్రశ్నించారు. పోలీసులు తమను బలవంతంగా అరెస్టులు చేసి పోరాటాలను ఆపలేరని స్పష్టంచేశారు.