ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయాన వర్షాలకు నేల వాలడంతో ఆ రైతు దిగులు చెందాడు. పెట్టుబడైనా వస్తదో రాదోనని కలతచెంది పొలంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో శుక్రవారం తీవ్ర విషాదం నింపింది.
గంభీరావుపేట, నవంబర్ 7 : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికి వచ్చే సమయాన వర్షాలకు నేల వాలడంతో ఆ రైతు దిగులు చెందాడు. పెట్టుబడైనా వస్తదో రాదోనని ఆలోచిస్తూ పొలంలోనే కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రైతు ధ్యానబోయిన ఇజ్జయ్య (65) తనకున్న ఎకరంలో వరి సాగు చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో పంటను కాపాడుకున్నాడు. కానీ, ఇటీవలి వర్షాలకు పొలం కోయడానికి వీలు లేకుండా పంట పూర్తిగా నేలవాలింది. పొలం కోయడానికి హార్వెస్టర్ వస్తుందన్న సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. నేలవాలిన వరిని నిల్చొని చూస్తూ ఉన్న ఇజ్జయ్య, అంతలోనే ఒక్క సారిగా కిందపడిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. తహసీల్దార్ మారుతీరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇజ్జయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.