అయిజ, నవంబర్ 7 : తుంగభద్ర నది (Tungabhadra River) పరీవాహక ప్రాంతంలో యాసంగి పంటలకు క్రాప్ హాలిడే (Crop Holiday) ప్రకటించారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రాంతాల ఎస్ఈలతో సెకండ్ వాటర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఎస్ఈలు చర్చించారు. ఈ ఏడాది టీబీ డ్యాంకు 168 టీఎంసీల వరద వచ్చిచేరిందని టీబీ బోర్డు ఎస్ఈ నారాయణనాయక్ తెలిపారు. తుంగభద్ర డ్యాం 33 గేట్లను మార్చేందుకు వీలుగా డిసెంబర్ 20 వరకు మాత్రమే పంటలకు సాగునీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. యాసంగిలో పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు రాష్ర్టాల ఆయకట్టుకు నీటి కేటాయింపులు చేశామని తెలిపారు. తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు 5.15 టీఎంసీలు, కర్నూల్లోని కేసీ కెనాల్‌కు 7.92 టీఎంసీలను కేటాయించారు.
తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు టీబీ డ్యాం ద్వారా యాసంగి పంటలకు సాగునీరు అందాల్సి ఉన్నది. కానీ యాసంగి పంటల సాగుకు క్రాప్‌హాలిడే ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం వరద జలాలను వినియోగించారు. వచ్చేనెల 20 వరకు ఆర్డీఎస్ ఆయకట్టుకు జరిపిన కేటాయింపు నీటిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నదని, మిగిలిన నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాల్సి ఉంటుందని జిల్లా ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టులో యాసంగి పంటలకు సాగునీరు అందించే వీలు లేదని, రైతులు గ్రహించి, యాసంగి పంటల సాగుపై పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. టీబీ బోర్డు నిర్ణయంతో ఆర్డీఎస్ ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. సమావేశంలో కర్నూల్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, అనంతపురం ఎస్ఈ సుధాకర్‌రావు, మునీరాబాద్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.