చౌటుప్పల్‌రూరల్, నవంబర్ 7: వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతినడంతో తీవ్ర ఆందోళనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఇటికల ఉపేందర్‌రెడ్డి (43) తనకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో పత్తిపంట వేశాడు. పెట్టుబడి కోసం బంగారాన్ని కుదవబెట్టాడు. ఆ మొత్తం సరిపోక రూ.7 లక్షలు బయట అప్పు చేసి పత్తి సాగుచేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా రంగుమారి చేతికి రాకుండాపోయింది. దీంతో తీవ్రమనస్తాపం చెందిన రైతు శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.