హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘నిన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పీయూష్ గోయల్‌ను కలిసి.. తేల్చేదాకా ఇక్కడే ఉంటమని చెప్తే.. ఈ వార్త నమస్తే తెలంగాణ పేపర్ ఫ్రంట్ పేజీలో అక్షరం ముక్క కూడా రాయలేదు’.. నమస్తే తెలంగాణ పత్రికలో రైతుల సమస్యపై, ధాన్యం సమస్యపై, మంత్రులు, ఎంపీల పోరాటంపై వార్తలు రాయడం లేదంటూ గురువారం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణ ఇదీ. ఇంతకన్నా చీప్ ఆరోపణ ఇంకేదైనా ఉంటుందా? ఒక పత్రికలో.. ‘జాకెట్’ పేజీకి, ఫస్ట్ పేజీకి తేడా ఉంటుందన్న కనీస పరిజ్ఞానం ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేకపోవడం విడ్డూరమే.
బుధవారం ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్తే.. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు.. మంత్రుల ఢిల్లీ పర్యటనకు సంబంధించినది. దానికి ముందున్న ‘జాకెట్’ (అంటే పూర్తిగా ప్రకటనలుండే పేజీ.. ఎక్కడైనా అంతరాలుంటే.. చిన్న వార్తలు పెడతారు. దీన్ని ఫస్ట్ పేజీ కింద పరిగణించరు) పేజీని చూపించి కేసీఆర్ గుండె చప్పుడైన నమస్తే తెలంగాణలో ఆ వార్తే ప్రచురించలేదంటూ రేవంత్‌రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టారు. ఫస్ట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో బ్యానర్ వార్త రేవంత్‌కు కనిపించనే లేదు. రైతుల సమస్యే.. నమస్తే తెలంగాణ పత్రిక ప్రథమ ప్రాధాన్యం. రైతుల వార్తల తర్వాతే మరే వార్త అయినా.
దాదాపు నాలుగైదు నెలలుగా ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన యుద్ధం చేస్తున్నదీ పత్రిక. నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు ఒకటి లేదా రెండు పూర్తిస్థాయి పేజీల కథనాలను ప్రచురిస్తున్నది. మొదటి పేజీని పరిగణనలోకి తీసుకొంటే ఈ సంఖ్య మూడు పేజీలకు పెరుగుతున్నది. ఏడాదిగా ఏ రోజు కూడా కనీసం ఒక పేజీకి తగ్గకుండా రైతుల వార్తలను ప్రచురిస్తున్నది. అంతేకాదు.. రైతుల పట్ల తనకున్న నిబద్ధత, సామాజిక బాధ్యతతో వారిని ఇతర పంటలవైపు మళ్లించడానికి చైతన్యం తేవడానికి నిరంతరం కృషిచేస్తున్నది.
బుధవారం నాటి సంచికలో కూడా ఢిల్లీలో మంత్రుల పోరాటంపై, కేంద్రం నిరంకుశ వైఖరిపై మొదటి పేజీతో కలిపి రెండున్నర పేజీల్లో కథనాలను ప్రచురించింది. ఈ విషయాలను దాచిపెట్టిన రేవంత్‌రెడ్డి.. పత్రికపై అబద్ధపు ప్రచారాన్ని చేయడం విడ్డూరమే. రైతుల సమస్యపై నమస్తే తెలంగాణలో వస్తున్న కథనాలపై బయట కూడా చర్చ జరుగుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో రైతుల వార్తలు, ధాన్యం వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నయి..
అంటూ రైతులు, రైతు సంఘాలు, రాజకీయ నాయకులు, చివరికి కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. కానీ రేవంత్‌రెడ్డికి మాత్రం కనిపించడం లేదు. తెలంగాణ రైతుల సమస్యపై, కేంద్రం నియంతృత్వ వైఖరిపై నమస్తే తెలంగాణలో కాకుండా మరే ఇతర పత్రికలో ఇంత భారీగా వార్తలు వస్తున్నయో రేవంత్‌రెడ్డి చెప్తే బాగుంటుంది. రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో, పార్లమెంట్లో చేసే పోరాటానికి మద్దతు ఇవ్వకుండా మొహం చాటేసిన రేవంత్ ఇప్పుడు నమస్తే పై నిందలు వేయడం విచిత్రం.