హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్ సిటీని అమెరికా, సింగపూర్‌తో పోటీ పడేలా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే ఎనిమిదేండ్లలో ఫ్యూచర్ సిటీని సంపూర్ణంగా నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని కాపాడుకొనే బాధ్యత అక్కడి రైతులు, యువతదేనని స్పష్టంచేశారు. వాళ్లే ఈ నగరాన్ని నిర్మించుకోవాలని అన్నారు. రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ వద్ద బుధవారం ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిపాలనా భవనాన్ని ఆయన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2034 నాటికి తెలంగాణ లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడంలో ఫ్యూచర్‌సిటీ పాత్ర కీలకమని తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఎంత పేరు వచ్చిందో.. ఫ్యూచర్‌సిటీకి అంతకన్నా ఎక్కువ పేరు తీసుకొస్తామని చెప్పారు.
ఫ్యూచర్‌సిటీలో గ్రీన్ ఫార్మా కంపెనీలతో పాటు ఏఐ, డాటా సెంటర్, విద్య, వైద్యం, క్రీడల యూనివర్సిటీలతోపాటు స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎఫ్‌సీడీఏ భవనానికి తాను వీలైనప్పుడు వస్తానని, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు వారానికి ఒకసారి వస్తారని తెలిపారు. మంగళవారం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయని, కిలోమీటర్ ప్రయాణానికి రెండు మూడు గంటల సమయం పట్టిందని ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగానే సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్పై మరోసారి తన నోటిదురుసును ప్రదర్శించారు. బండకేసి కొడుతరు, తొక్కుకుంటా పోతరు అంటూ అదే పాత భాష మాట్లాడారు. బీఆర్ఎస్ను ప్రజలు ఇప్పటికే శ్మశానానికి పంపించారంటూ మరోసారి తన నోటి వెంట చావు భాష మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రంగారెడ్డి/కందుకూరు : ఫ్యూచర్‌సిటీ ప్రకటనతో రంగారెడ్డి జిల్లాలోని భూములకు మరింత డిమాండ్ పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎకరం భూమి రూ.230 కోట్లు పలికిందని, ఫ్యూచర్‌సిటీ పూర్తయితే ఆ ధరలు మరింత పెరుగుతాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో కందుకూరు, మహేశ్వరం మండలాల గ్రామాలతోపాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని నాగార్జునసాగర్‌కు పడమరవైపు ఉన్న అన్ని గ్రామాలను కలుపుతున్నట్టు సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, నవీన్‌యాదవ్, మనోహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు కోదండరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్‌సిటీ సాక్షిగా ముఖ్యమంత్రి, మంత్రులు మళ్లీ అవే అబద్ధాలను వల్లెవేశారు. ఫ్యూచర్‌సిటీలో ఇతర కంపెనీలతోపాటు గ్రీన్ ఫార్మాకు పెద్దపీట వేస్తామని చెప్పారు. కానీ ఉన్న భూములన్నీ ఇతర కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు గ్రీన్ ఫార్మాకు ఎక్కడా భూములు కేటాయించిన దాఖలాలు కనిపించలేదు. ఓవైపు ఫార్మాసిటీని రద్దుచేస్తామని ప్రజల ముందు చెప్తున్న ప్రభుత్వం న్యాయస్థానంలో మాత్రం దీనిని కొనసాగిస్తామని అఫిడవిట్ దాఖలుచేసింది. ఫార్మాసిటీలో కాలుష్యరహిత గ్రీన్ఫార్మా కంపెనీలకు అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పినప్పటిటీ.. ఫ్యూచర్ సిటీలో ఇప్పటి వరకు ఫార్మా కంపెనీలకు స్థానమే కల్పించలేదు. తాము అధికారంలోకి వస్తే రైతుల పట్టా భూములను తిరిగి వారికే ఇస్తామని చెప్పిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సీఎంతోపాటు వేదికపైనే ఉన్నప్పటికీ రైతులకు భూములిప్పించే విషయాన్ని ప్రస్తావించలేదు. ఇప్పటికే రైతులు తమ పట్టా భూములను తిరిగి ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమితోపాటు యాచారం మండలంలోని కుర్మిద్ద, నానక్‌నగర్, తాటిపర్తి, మేడిపల్లి గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న పట్టా భూముల గురించి కూడా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. తాము అధికారంలోకి వస్తే రైతుల పట్టా భూములను ఆన్లైన్లో చేర్పిస్తామని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు నోరు మెదపకపోవటంతో సభకు వచ్చిన రైతులు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు.